ఓవైపు అధ్యక్ష ఎన్నికలకు రెడీ అవుతున్న కాంగ్రెస్ కు రాజస్థాన్ రాజకీయ సంక్షోభం తలనొప్పిగా మారింది. రాజస్థాన్ సీఎం కుర్చీ సచిన్ పైలట్‌కు ఇచ్చేందుకు ససేమిరా అంటోన్న ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వర్గీయులు మూకుమ్మడి రాజీనామాకు దిగారు. దీంతో వారిని బుజ్జగించేందుకు సీనియర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సందు దొరికింది కదా అని ఈ క్రమంలో బీజేపీ సెటైర్లు వేయడం షురూ చేసింది.
రాహుల్ గారూ.. ముందు మీ జోడో యాత్రను పక్కన బెట్టి రాజస్థాన్ లో పరిస్థితులు చక్కబెట్టండి అంటూ సెటైర్ వేసింది. రాజస్థాన్‌లో సంక్షోభ పరిస్థితులపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ట్విటర్ వేదికగా స్పందించారు. గతంలో గహ్లోత్, పైలట్ కలిసి రాహుల్ గాంధీతో దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ముందు వీరిద్దరిని కలపండి’’ అంటూ సెటైర్ వేశారు. మరో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ.. ‘‘శిబిరాల ప్రభుత్వం. మరోసారి రిసార్టులకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది’’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.