శశికళ గురించి బీజేపీ మనసులో ఏముంది..?

-

శశికళ రాష్ట్రంలోకి అడుగుపెట్టి ఒకరోజు గడిచిందో లేదో అప్పుడే అన్నాడీఎంకే ప్రభుత్వం చిన్నమ్మకు షాక్‌ ఇచ్చింది. ఆమెకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తూ పళనిస్వామి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే శశికళ బీజేపీతో అంతర్గత ఒప్పందం కారణంగానే జైలు నుంచి విడుదలయ్యారనే ఊహాగానాలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. బీజేపీ డైరక్షన్లోనే శశికళ అడుగులు వేస్తారనే విశ్లేషణలు ఉన్నాయి. అసలు శశికళ గురించి బీజేపీ మనసులో ఏముంది…

బీజేపీ కావాలనుకుంటే శశికళను పార్టీలోకి తీసుకునేలా అన్నాడీఎంకేకు డైరక్షన్ ఇస్తుందని కూడా అంటున్నారు. అయితే బీజేపీ మనసులో అసలేముందనే విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే శశికళకు రజనీకాంత్ చేసిన ఫోన్ కాల్ కూడా కలకలం రేపుతోంది. సూపర్ స్టార్ శశికళకు ఎందుకు ఫోన్ చేశారనే విషయంపై చర్చోపర్చలు జరుగుతున్నాయి. రజనీ తనంతట తానుగా ఫోన్ చేశారా, బీజేపీ చేయమంటేనే చేశారా, నిజంగా ఆరోగ్యం గురించి వాకబు చేయడానికే ఫోన్ చేశారా.. ఆ పేరుతో రాజకీయాలు మాట్లాడారా అనే విషయాలపై భిన్నాభిప్రాయాలున్నాయి.

జయ మరణం తర్వాత ఓ దశలో అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోతుందనే ప్రచారం జరిగింది. పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడంతో, ఆయనకు బీజేపీ మద్దతు ప్రకటించడంతో.. స్టాలిన్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. అయితే రిసార్ట్ పాలిటిక్స్ చేసిన శశికళ.. ఎమ్మెల్యేల్ని కాపాడుకున్నారు. కానీ శశికళకు జైలుకు వెళ్లాల్సి రావడంతో.. పళనిస్వామిని సీఎంగా ఆమే ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు కూడా సమర్థించారు. అయితే శశికళ జైలుకు వెళ్లాక.. బీజేపీ ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఢిల్లీ పెద్దల జోక్యంతో.. పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య రాజీ కుదిరి.. అంతా సజావుగా నడిచింది. కానీ ఇప్పుడు శశికళ జైలు నుంచి విడుదల కావడంతో.. అన్నాడీఎంకేలో మళ్లీ చీలిక వస్తుందా అనే సందేహాలు వస్తున్నాయి.

ఇప్పటికైతే బీజేపీ శశికళ గురించి ఏం మాట్లాడటం లేదు. తమ పొత్తు అన్నాడీంకేతోనే అని స్పష్టం చేసింది. ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. అసలు తమిళ ప్రజలపై శశికళ ఎంత ప్రభావం చూపగలరనేది కూడా కీలకమైన ప్రశ్నే. జయలలితను తమిళ ప్రజలు అమ్మగా అభిమానించారు. కానీ శశికళకు ఎప్పుడూ నేరుగా ప్రజలతో సంబంధాల్లేవు. ఆమె ఎప్పుడూ బహిరంగ సభలో మాట్లాడింది కూడా లేదు. శశికళ జనాకర్షణ ఉన్న నేత కాదని, ఆమె ఏమాత్రం ప్రజల్ని ఆకర్షించలేరనే వాదన లేకపోలేదు.

అటు కమల్ హాసన్ విషయంలో కూడా బీజేపీ వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే కామెంట్లపై చర్చ జరుగుతోంది. ఒకవేళ శశికళ నిజంగా అన్నాడీఎంకేను చీల్చినా.. అది ప్రత్యర్థి డీఎంకేకు లాభమౌతుందనే వాదన కూడా ఉంది. గతంలో పళని, పన్నీర్ వర్గాల మధ్య రాజీ కుదిర్చిన బీజేపీ.. ఇప్పుడు శశికళ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version