టీఆర్ఎస్ గుండా గిరికి భయపడేది లేదని బీజేపీ నేత డీకే. అరుణ అన్నారు. నిన్న బండి సంజయ్ పై జరిగిన దాడిపై గవర్నర్ తమిళి సై కి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వారి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని.. మెడలు నరుకుతాం.. ఆరు ముక్కలు చేస్తాం అనే పదజాలంతో వారి పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసే విధంగా మాట్లాడారని విమర్శించారు. ప్రభుత్వం తమ బాధ్యతల్లో ఫెయిల్ అయినప్పుడు తప్పకుండా ప్రతిపక్షం నిలదీస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం వానాకాలం వరిధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవడం లేదని విమర్శించింది. రైతులు వరిధాన్యం కొనుగోలు విషయంలో ఆందోళన పడుతుంటే ప్రభుత్వం నిమ్మకునీరెత్తని విధంగా వ్యవహరిస్తుందన్నారు.
హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని డీకే అరుణ అన్నారు. వేల కోట్లు ఖర్చుపెట్టినా… జీవోలు తెచ్చిన ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలిపింది. తెలంగాణ ప్రజల ఆలోచనలే హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రతిబింబించాయని ఆమె తెలపింది.