పవన్ త్యాగాలకు అవమానాలే బహుమానాలా ?

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా పడుతున్న ఇబ్బందులు, అవమానాలు జన సైనికులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. అసలు పవన్ కు ఉన్న చరిష్మా, అభిమానుల బలం అన్నిటిని లెక్క వేసుకుంటే, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే పార్టీలు ఏవైనా ఆయనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అన్నట్లుగా పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అవమానకరమైన రీతిలో ఫలితాలను ఎదుర్కొని రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే పార్టీ స్థాపించిన తరువాత పవన్ వేసిన తప్పటడుగులే దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. జరిగిందేదో జరిగింది.. బలమైన రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు ఆర్థికంగా, రాజకీయ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే ఉద్దేశంతో పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్న మొదటిరోజు నుంచి బిజెపి అగ్రనేతలు పవన్ ను పరిగణలోకి తీసుకోనట్టుగా వ్యవహరిస్తూ వస్తోంది.

ఇప్పటి వరకు ప్రధాని మోదీ ,అమిత్ షా వంటి వారి దర్శనం కోసం పవన్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, వారి అపాయింట్మెంట్ లభించకపోవడంతో మిగతా బిజెపి పెద్దలు, కేంద్ర మంత్రులు వంటి వారిని కలిసి , తాము చెప్పాల్సింది చెప్పేసి వస్తున్నారు.పవన్ కు బీజేపీ నుంచి అవమానాలు ఎదురవుతున్నా, వాటిని భరిస్తూనే వస్తున్నారు. బిజెపి వైఖరిపై పవన్ కు అనేక అనుమానాలు ఉన్నా, వాటిని జనసేన రాజకీయ భవిష్యత్తు కోసం భరిస్తూనే వస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ప్రజా ఉద్యమాలు చేయాలనే ఆలోచనతో పవన్ ఉన్నా, బిజెపి వెనక్కి లాగుతూ వచ్చినా, పవన్ మౌనంగానే ఉండిపోతూ వస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా అభ్యర్థులను నిలబెట్టి, బిజెపి ఒత్తిడితో వెనక్కి తగ్గడమే కాకుండా, నామినేషన్ వేసిన అభ్యర్థులను సైతం వెనక్కి తీసుకోవాల్సిందిగా పవన్ ప్రకటన చేశారు. అయితే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో తమకు అవకాశం ఇస్తారని పవన్ ఆశలు పెట్టుకోగా, అదే స్థానం నుంచి బిజెపి పోటీ చేయాలని ప్రయత్నిస్తూ వస్తోంది.

ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకునేందుకు పవన్ ఢిల్లీ కి వెళ్లి రెండు రోజులపాటు ఉన్నారు. ఇక తిరుపతి ఉప ఎన్నికలపై జనసేన అభ్యర్థిని నిలబెట్టాలా, లేక బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాలా అనే విషయంపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అభ్యర్థిని డిసైడ్ చేయాలని ముందుగా రెండు పార్టీలు భావించినా, ఆకస్మాత్తుగా తిరుపతిలో ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ ఎన్నికల్లో జనసేన బలపరిచిన బిజెపి అభ్యర్థి పోటీ చేస్తారు అంటూ సంచలన ప్రకటన చేయడం జనసేన వర్గాలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఒకపక్క కమిటీని వేసిన వెంటనే, బిజెపి పోటీ చేస్తుందని ప్రకటించడం వెనుక కారణాలు ఏమిటో పవన్ కు కాని, జన సైనికులకు కాని అర్థం కాలేదు. కాకపోతే సోము వీర్రాజు ఈ ప్రకటనతో పవన్ కు మరోసారి అవమానం ఎదురైంది.

అసలు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నా, ఈ విధంగా వ్యవహరించడం చూస్తే పవన్ కు బిజెపి పెద్ద గా ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం మొదలవడంతో జనసైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కాకపోతే ఈ వ్యవహారం గురించి ఇప్పటి వరకు పవన్ స్పందించకపోవడంతో ఆయన స్పందన కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version