ఉత్తరాధి రాష్ట్రాల్లో సత్తా చాటిన బీజేపీ.. దక్షిణాదిన మాత్రం రాణించలేకపోతోంది. ఒక్క కర్నాటక మినహా మిగతా రాష్ట్రాల్లో అంతగా ప్రభావం చూపలేదు. దక్షిణాదిన పాగా వేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది కమలం పార్టీ. అందులో భాగంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పుదుచ్చేరిలో ఆపరేషన్ మొదలు పెట్టినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలకు గాలం వేస్తోంది. ఇందులో భాగంగానే పీసీసీ చీఫ్ నమశివాయతో తిరుగుబాటు చేయించిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన బీజేపీలో చేరారు. దాంతో కాంగ్రెస్ నేతల ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.
ఐతే పుదుచ్చేరి అధికార పార్టీలో సంక్షోభం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. నారాయణస్వామి తీరుపై కొన్నాళ్లుగా పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పదవుల్లోనూ తమకు అన్యాయం జరిగిందంటూ ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాంగ్రెస్ చీఫ్ నమశివాయ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ పోస్టు ఖాళీ అవ్వడంతో సీనియర్ నేత లక్ష్మీనారాయణ్ పీసీసీ చీఫ్ ఇవ్వాలని కోరారు. ఇటు అధిష్టానం కూడా లైట్ తీసుకుంది. పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం రాజీనామా చేశారు. తాను సీనియర్ నాయకుడినైనా కనీసం మంత్రి పదవి ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని, ఈ సంక్షోభానికి తనని నిందించొద్దన్నారు.
ఇటీవల తమిళనాడులో పర్యటిస్తున్న బీజేపీ నేతలు తమిళనాడులో అంతర్భాగంగా కన్పించే పుదుచ్చేరి పైనా ఫోకస్ పెట్టారు.అందులో భాగంగానే ఈ రాజీనామాల ఎపిసొడ్ మొదలైందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ముందే…ఈ ఆపరేషన్ కమలం చేపట్టడం వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్లు కన్పిస్తోంది. ప్రభుత్వం కూలిపోయి పుదుచ్చేరి కేంద్రం చేతిలోకి వెళ్తుంది. దాంతో నారాయణ స్వామి ఆధ్వర్యంలో కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ పెద్దరికంలో ఎన్నికలు జరిగితే తమకు కలిసొస్తాయని లెక్కలేసుకుంటోంది బీజేపీ.
అందుకే కిరణ్‌బేడిని తప్పించి తెలంగాణ గవర్నర్ తమిళిసైకి బాధ్యతలు అప్పగించారనే ప్రచారం జరుగుతోంది. కిరణ్ బేడీ అసలే ఫైర్ బ్రాండ్. ముక్కుసూటిగా ఉంటారు.. ఎవరి మాట వినే రకం కాదు అందుకే కిరణ్ బేడీని అక్కడ నుంచి తప్పించి.. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యలు అప్పగించారని పుదుచ్చేరి పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళిసై సైతం..తనదైన మార్కుతో దూకుడు చూపిస్తున్నారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించారు. తాజాగా రాజ్ భవన్ లో పలువురి ఉద్యోగులపై వేటు వేశారు. దీనికి వెనుక కూడా రాజకీయా కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదీ ఏమైనా బీజేపీ వ్యూహం మాత్రం వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి.
ఇప్పుడు అసెంబ్లీ బలపరీక్షకు ముందే నారాయణ స్వామి రాజీనామా చేయడంతో అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో లెప్ట్ నెంట్ గవర్నర్ తో కూడా కేంద్ర పాలన అమల్లోకి వస్తుంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గానే అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేయొచ్చు.. ఈ పరిణామాలు అన్నీ ఊహించే బీజేపీ పెద్దలు లెప్ట్ నెంట్ గవర్నర్ గా తమిళిసైకి అదనపు బాధ్యతలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.