మన ఇంట్లో వంటగదిలో మనకి కనిపించే నువ్వులు నిజానికి పెద్ద ఆరోగ్య రహస్యాన్ని దాచుకుని ఉంటాయి. చట్నీలో, లడ్డూలో, నూనెలో… ఏ రూపంలో చూసినా నువ్వులు మన ఆహారంలో భాగమే. కానీ ఏ రకం నువ్వులు తింటే ఎక్కువ లాభం? అన్న ప్రశ్న చాలామందికి వస్తుంది. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, గోధుమ రంగు నువ్వులు, ప్రతి రకానికీ ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్, మంచి కొవ్వులు ఇవన్నీ నువ్వుల్లో సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఎముకల బలంగా, గుండె ఆరోగ్యం, జీర్ణశక్తి మెరుగుపడటంలో నువ్వుల పాత్ర చాలా కీలకం. అందుకే ఏ రకం నువ్వులు తినాలో తెలుసుకోవటం ముఖ్యం.
తెల్ల నువ్వులు ఎక్కువగా మైల్డ్ రుచితో ఉంటాయి. ఇవి జీర్ణానికి తేలికగా ఉండి, శక్తిని ఇస్తాయి. కాల్షియం ఎక్కువగా ఉండటంతో ఎముకలు, పళ్ళు బలంగా మారుతాయి. నల్ల నువ్వులు మాత్రం ఐరన్ యాంటీఆక్సిడెంట్స్‌లో మరింత సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి, అలసట ఎక్కువగా అనిపించే వారికి ఇవి చాలా మంచివి.

చలికాలంలో నల్ల నువ్వులతో చేసిన లడ్డూలు శరీరానికి వేడి ఇస్తాయి. గోధుమ రంగు నువ్వులు కూడా మంచి ఫైబర్‌తో జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంటే మీ అవసరాన్ని బట్టి నువ్వుల రకం ఎంచుకుంటే, లాభం మరింత పెరుగుతుంది.
రోజూ కొద్దిగా నువ్వులను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంలో మంచి మార్పు కనిపిస్తుంది. వీటిని చట్నీలలో, పొడి సలాడ్ టాపింగ్ లేదా లడ్డూ రూపంలో తీసుకోవచ్చు. అయితే ఎంత తింటున్నామో ముఖ్యం. ఎక్కువ తింటే వేడి సమస్యలు రావచ్చు. సమతుల్యంగా తీసుకుంటే చర్మం మెరుస్తుంది, జుట్టు బలపడుతుంది, శక్తి స్థాయి పెరుగుతుంది. చిన్నవి అయినా, నువ్వుల ప్రయోజనాలు మాత్రం పెద్దవే.
గమనిక: ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా అలెర్జీలు ఉన్నవారు నువ్వులు ఎక్కువగా తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
