నా ఆత్మగౌరవం కంటే మంత్రి పదవి ఎక్కువ కాదు. చావనైనా చస్తా గానీ లొంగిపోను. సిట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ చేయించండి. వీలైతే ఎన్ని సంస్థలు ఉంటే అన్ని సంస్థలతో ఎంక్వయిరీ చేయించండి అని అధికార పార్టీలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఇంత వరకు ఇలాంటి సవాల్ చేయలేదు. కానీ రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను కబ్జా చేశారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈటల ఈ సవాల్ చేశారంటేనే అర్థం అవుతోంది అసలు కుట్ర దారులు ఎవరో.
నిజానికి ఒక అధికార పార్టీ మంత్రిపై ఆరోపణలు వస్తే ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్రంగా దుమ్మెత్తిపోస్తాయి. కానీ ఇక్కడ ఈటల విషయంలో ట్విస్టు ఏంటంటే.. ప్రతిపక్షాలు, ప్రజలు ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఆయన ఏ తప్పు చేయలేదని ప్రెస్ మీట్లు పెట్టి మరీ సపోర్టు ఇస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి కావచ్చు ఓ అధికార పార్టీ మంత్రికి ఇంతమంది సపోర్టు చేయడం.
66 ఎకరాల అసైన్డ్ భూములను మంత్రి ఈటల కబ్జా చేశారని రైతులు డైరెక్ట్ గా వెళ్లి సీఎంను కలిశారని వార్తలు వచ్చాయి. అసలు సామాన్య రైతులు డైరెక్ట్ గా వెళ్లి సీఎంను ఎలా కలిశారనేది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న. ఎన్నోసార్లు ఎంతో మంతి టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల మీద కబ్జా ఆరోపణలు వచ్చినా.. వాటిపై స్పందించని కేసీఆర్.. ఈటల విషయంలో మాత్రం కేవలం 24గంటల్లో విచారణ కంప్లీట్ చేయించడం ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తోంది.
మరి ఇన్నేళ్లుగా ఈ వ్యవహారం ఎందుకు బయటకు రాలేదు. ఇప్పుడే ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు కొన్ని సమాధానాలు కుడా ఉన్నాయి. ఈటల రాజేందర్ గత కొద్ది రోజులుగా ఇన్ డైరెక్ట్ గా టీఆర్ ఎస్ ఆగడాలపై గొంతెత్తుతున్నారు. ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. పార్టీలోకి వచ్చిన ఇతర మంత్రులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు ఈటలకు నచ్చజెప్పినా.. ఆయన తగ్గకపోవడంతో ఎలాగైనా వేటు వేయాలని టీఆర్ ఎస్ కోర్ టీం భావించిందని ఈటల అనుచరులు చెబుతున్నారు. ఇక అప్పటి నుంచి ఈటలను కేసీఆర్ దూరంగా ఉంచుతున్నారు.
ఇక కరోనా సమాచారం కూడా హెల్త్ డైరెక్టర్ తో చెప్పించడం కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు టైం్ చూస్కొని ఈటలపై వేటు వేశారని ఆరోపణలు వస్తున్నాయి. అసైన్డ్ భూములను తామే అమ్మడానికి వెళ్తే ఈటల ఒప్పుకోలేదని అచ్చంపేట సర్పంచ్ లక్ష్మీ ముందు మీడియాకు తెలిపింది. కానీ ఆ తర్వాత డబ్బులు తీసుకున్నామని మరో మాట చెప్పింది.
ఇక్కడే అసలు కుట్ర బయడపడిందని ఈటల వర్గీయులు చెబుతున్నారు. అసలు ఈటల ఆరోపణ వార్తలు కూడా కేవలం రెండు, మూడు ఛానళ్లలోనే వచ్చాయని, అదికూడా టీఆర్ ఎస్ అనుకూల ఛానళ్లలో రావడంతో.. ఇదంతా కుట్ర ప్రకారం చేశారని ఈటల చెబుతున్నారు. ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా చేశారని ఇన్ డైరెక్ట్ గా కేసీఆర్ టీంపై ఆయన ఆరోపణలు చేస్తున్నారు.
ఒక్కొక్క విచారణ కనీసం నెల రోజులైనా పడుతుంటే.. ఈటల విషయంలో మాత్రం కేవలం 24గంటల్లో విచారణ ఎలా పూర్తి చేశారంటే ఆయన అభిమానులు ఆందోళన తెలుపుతున్నారు. అందరు మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో ఇలాగే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఈటల అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తెలుపుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ ల దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. ఈటల మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీచేస్తే తామే గెలిపించుకుంటామని హుజూరాబాద్ వాసులు చెబుతున్నారు. అయితే తాను పార్టీ మారనని, నిజాలు తేల్చాలని ఈటల పట్టుబడుతున్నారు. త్వరలోనే పూర్తి నిజాలతో ప్రజల ముందుకు వస్తానని చెబుతున్నారు. చూడాలి మరి ఈటల పయనం ఎటువైపు ఉంటుందో.