కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ‘బన్ని’ ఉత్సవం అంగరంగవైభవంగా జరిగింది. దసరా పండుగను పురస్కరించుకుని శనివారం రాత్రి నిర్వహించిన బన్ని ఉత్సవంలో మరోసారి భారీగా తలలు పగిలాయి. అర్ధరాత్రి 12 గంటలకు మాళమల్లేశ్వర స్వామి కల్యాణం అనంతరం ఉత్సవ విగ్రహాలను సొంతం చేసుకునేందుకు వందలాది మంది భక్తులు పోటీ పడ్డారు.
ఈ క్రమంలోనే దేవరగట్టులో ఎప్పటిలాగానే కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో దాదాపు 80 మంది తలలు పగలగా.. 100 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలాఉండగా, నిప్పు రవ్వలు పడి మరికొందరు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దేవరగట్టుపై కొలువైన మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం ప్రతీ ఏటా దసరా నాడు జరుపుతారు.ఉత్సవమూర్తులను ఆలయం నుంచి కొండ మీదికి ఊరేగింపుగా తీసుకెళ్లే టైంలో ఆలయ నిర్వాహక గ్రామాలు నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు ఉత్సవమూర్తులను దక్కించుకోవడానికి ఇలా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు.