కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మగౌడ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. చిక్ మంగళూరు వద్ద రైల్వే ట్రాక్ మీద ధర్మగౌడ మృత దేహాన్ని ఈ ఉదయం పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలిలో సూసైడ్ నోట్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న సాయంత్రం కారులో ఇంటి నుంచి ఒంటరిగా ధర్మగౌడ బయల్దేరారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
రాత్రికి ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో అప్రమత్తమైన ఆయన గన్ మెన్ లు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రాత్రంతా పోలీసులు ధర్మగౌడ ఆచూకీ కోసం వెతికినా దొరకలేదు. కానీ ఉదయాన్నే చిక్ మంగళూరు రైల్వేట్రాక్ వద్ద ఆయన మృతదేహం లభించింది. జేడీఎస్ నుంచి ధర్మగౌడ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ధర్మగౌడ ఆత్మహత్యతో మాజీ ప్రధాని దేవేగౌడ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ధర్మగౌడ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు.