తెలంగాణాలో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. త్వరలో కెసిఆర్ మంత్రి వర్గ విస్తరణ చేయడానికి సిద్దమయ్యారని ఈ మేరకు ఆయన కసరత్తు కూడా పూర్తి చేసారని సమాచారం. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకుంటారు అనేది స్పష్టత రావడం లేదు.
ముందు కవిత సహా పలువురి పేర్లు ఎక్కువగా వినిపించాయి అయినా సరే వారిని ఎవరిని కాదని కెసిఆర్ అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు కొందరు కీలక నేతల పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. వికారాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందని అంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆ జిల్లాలో కొందరు కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టినట్లు అవుతుంది అని కెసిఆర్ భావిస్తున్నారు.
అదే విధంగా మరికొందరు నేతల పేర్లు కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సహా పలువురి పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. వీరిలో ఒకరిని ఎమ్మెల్సీని చేసి మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సోషల్ మీడియాలో కూడా వీరి పేర్లు ఎక్కువగానే ప్రస్తావనకు వస్తున్నాయి.
అలాగే పార్టీ కీలక నేత పల్లా రాజేశ్వర్ రెడ్డిని కూడా మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ కి చెందిన ఒక యువనేతను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంత వరకు నిజమో గాని సోషల్ మీడియా జనాలు మాత్రం దీని గురించి ఎక్కువగా చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.