మన కిచెన్ లో బ్రిటీష్ వంటకాలు..?

-

ఆరునెలలు సావాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారు అంటారు. అలాంటిది ఏకంగా 200 ఏళ్లు మనల్ని పాలించిన బ్రిటీష్ వాళ్లు మన ఆచారాలు, సంప్రదాయాలు, రుచులు ఏం నేర్చుకున్నారో కానీ.. వారు తిరిగి వెళ్తున్నప్పుడు మాత్రం ఎన్నో గుర్తులను, వారి అలవాట్లను మన వద్దే వదిలేసి వెళ్లారు. మనం తినే తిండి నుంచి తిరిగే వాహనాలు, మనల్ని పాలించే రాజ్యాంగం వరకు అన్నింటిలో బ్రిటీష్ మార్క్ కనిపిస్తుంది. ముఖ్యంగా మన ఆహారపుటలవాట్లపై ఇంగ్లీష్ వారి ముద్ర బాగానే పడింది. వారి కాలంలో మన వంట గదిలోకి ఎన్నో ఆంగ్ల వంటకాలు, దినుసులు ఎంట్రీ ఇచ్చాయి. వాటి గురించి తెలుసుకుందామా..

 

200 ఏళ్లు పాలించిన బ్రిటీషర్లు మన జీవితాల్లోకే కాదు. మన వంటగదిలోకీ వచ్చారు. మసాలాల వాడకం నుంచి  ఇప్పుడు మనం తింటున్న కూరగాయలు, పండ్ల వరకు అన్నింటిపైనా ఇంగ్లీష్ ప్రభావం కాస్త గట్టిగానే పడిందని చెప్పొచ్చు. అంతెందుకు మాంసం వండే విధానంలో కూడా మార్పు వచ్చింది.

ఆంగ్లో-ఇండియన్ వంటకాలు..  మనదేశంలో బ్రిటిషర్స్‌‌ కాలంలోనే ఎక్కువగా ఆంగ్లో–ఇండియన్ వంటకాలు పుట్టాయి. ఈ వంటకాలకు ప్రజల నుంచి ఆదరణ వచ్చింది. బ్రిటిష్ వాళ్లు మన దేశానికి సముద్ర మార్గంలో వచ్చేవాళ్లు. వాళ్ల వెంట తెచ్చుకున్న కూరగాయలు, ఫుడ్‌‌ జర్నీలోనే అయిపోయేవి. వాళ్ల రెగ్యులర్ ఫుడ్‌‌లో భాగమైన ఆలుగడ్డలు, క్యారెట్లు, కాలీఫ్లవర్లు ఇక్కడ దొరికేవి కావు. దాంతో ఇండియన్ కూరగాయలతోనే వండుకునేవాళ్లు.

కానీ.. మన రెసిపీలకు బ్రిటిష్‌‌ పద్ధతులు చేర్చి వండేవాళ్లు. ఆ తర్వాత కొన్నాళ్లకు వాళ్ల కూరగాయలను మన భూమిలో  పండించడం మొదలుపెట్టారు. అప్పుడు మనవాళ్లు ఆ కూరగాయలను మన స్టైల్‌‌లో వండడం మొదలుపెట్టారు. అలా ఆంగ్లో– ఇండియన్ ఫుడ్ పుట్టింది. ముఖ్యంగా 1757 నుండి 1857 మధ్య ఇలాంటి మార్పులు ఎన్నో వచ్చాయి. ఆ తర్వాత అవే కంటిన్యూ అయ్యాయి.

మసాలా దినుసులు..  బ్రిటిషర్లు రుచికరమైన వంటకం ఏది చేయాలన్నా మసాలాలు పడాల్సిందే. అందుకే వాళ్లు మసాలాల కోసం ఇండియాకు వచ్చారు. వాళ్ల వల్లే అనేక రకాల మసాలాలు మన వంటకాల్లో చేరాయి. మిరపకాయ, జాజికాయ, దాల్చిన చెక్క, లవంగాలు లాంటివన్నీ బ్రిటిష్‌‌ వాళ్ల వల్లే మనం వంటల్లో వేసుకోవడం మొదలుపెట్టాం. భారతీయ కుటుంబాలు మొదటగా వాటిని వంటల్లో వేయడానికి వెనకడుగు వేసినప్పటికీ తర్వాత అలవాటైపోయింది. వాటితో కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేసేవాళ్లు మనవాళ్లు.

కూరగాయలు.. బ్రిటిష్‌‌వాళ్లు తీసుకొచ్చిన కూరగాయలను మనవాళ్లు ఎంతలా సొంతం చేసుకున్నారంటే.. ఇప్పుడు ఆ కూరగాయలు మనవి కావన్నా నమ్మలేరు. ముఖ్యంగా బ్రిటిష్‌‌ వాళ్ల వల్లే మన దేశానికి వచ్చిన ఆలుగడ్డలను ఎన్నో రకాల వంటల్లో వాడుతున్నాం. అంతెందుకు ప్రతి కూరలో వేసే టొమాటోలు కూడా బ్రిటీష్‌‌వాళ్లు తీసుకొచ్చినవే. ఏ కూర వండినా రెండు టొమాటోలు పడితే ఆ రుచే వేరు. ఇవే కాదు.. గుమ్మడికాయ, క్యారెట్లు, క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా ఒకప్పుడు భారత భూమికి విదేశీ కూరగాయలే. మొదట్లో బ్రిటిష్ అధికారులు ఈ కూరగాయలను వాళ్ల కిచెన్ గార్డెన్స్, లాన్స్‌‌లో పెంచుకునేవాళ్లు. వాళ్ల దగ్గర పనిచేసే ఇండియన్‌‌ సర్వెంట్స్‌‌కు వాటి రుచి నచ్చి, పొలాల్లో పండించుకోవడం మొదలుపెట్టారు. అయితే.. ఇప్పటికీ చాలామందికి ఈ కూరగాయల అసలు మూలం ఇంగ్లండ్‌‌ అనే విషయం తెలియదు.

పండ్లు..  యాపిల్‌‌, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్ లాంటి పండ్లు కూడా బ్రిటిష్ వాళ్ల వల్లే మన ఫుడ్‌‌ కల్చర్‌‌‌‌లోకి వచ్చాయి. బ్రిటిష్‌‌ వాళ్లే ఈ పండ్లను ఇండియాకి తీసుకొచ్చి, ఇక్కడ పెంచడం మొదలుపెట్టారు. వాళ్ల తోటల్లో పనిచేసేవాళ్లు వాటి విత్తనాలను తీసుకెళ్లి ఇంటి పరిసరాల్లో నాటుకునేవాళ్లు. ఎప్పుడూ చూడని పండ్లు, పైగా టేస్ట్‌‌ కొత్తగా ఉండడంతో వాటిని తినడానికి అలవాటు పడ్డారు. అలా ఈ పండ్లు మన కల్చర్​లో భాగమయ్యాయి.

ఛాయ్‌‌..   ఛాయ్‌‌ని మనకు పరిచయం చేసింది బ్రిటిషర్లే అయినా.. తేయాకు మాత్రం మనదే. కానీ.. చాలామందికి ఈ విషయం తెలియదు. బ్రిటిషర్లు రాకముందు నుంచే అస్సాంలోని అడవుల్లో, బీడు భూముల్లో తేయాకు చెట్లు బాగా పెరిగేవి. బ్రిటిషర్లు ఆ ప్లేసుల్లోనే టీ తోటలను ఏర్పాటు చేశారు. టీతో పాటు వాళ్లు కాఫీ, విస్కీ, జిన్ లాంటి ఆల్కాహాల్‌‌ కూడా ఇండియన్స్‌‌కి పరిచయం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version