జగిత్యాల నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైఖరిపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారు. ఆయన తీరు వల్ల బిఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని ప్రచారం నడుస్తోంది. ఇటీవల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి..ఎమ్మెల్యేని విభేదించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే తీరుపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు.
అలాగే ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అయినా బిఆర్‌ఎస్ అధిష్టానం ఆమెని పట్టించుకోలేదు. దీంతో కౌన్సిలర్ పదవికి సైతం రాజీనామా చేశారు. కానీ పార్టీ నేతగా కొనసాగుతానని చెప్పారు. ఇలా పార్టీలో కొనసాగుతూనే తాజాగా ఆమె పార్టీకి సైతం రాజీనామా చేశారు. బిఆర్‌ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతోనే ఆమె పార్టీని వీడారు. అయితే ఆమె మొదట నుంచి ఎమ్మెల్యే సంజయ్..కవిత వర్గాన్ని దూరం చేసే పనిలో ఉన్నారని ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యే వేధింపులు వల్లే పార్టీకి రాజీనామ్ చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కౌన్సిలర్ గా బీ ఫామ్ ఎమ్మెల్యే ఇచ్చినా..ప్రజల మద్ధతుతోనే గెలిచానని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జగిత్యాలలో గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరుపున సంజయ్‌ని నిలబెట్టి కవిత గెలిపించారు. జీవన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ సీనియర్‌ని ఓడించారు. కానీ తొలిసారి ఎమ్మెల్యే అయిన సంజయ్..అనుకున్న మేర పనులు చేయడంలో విఫలమయ్యారు. సొంత పార్టీలోనే వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఫలితంగానే శ్రావణి పార్టీ నుంచి బయటకెళ్లారు.
నెక్స్ట్ ఎన్నికల్లో ఈయన గెలవడం కష్టమని ప్రచారం నడుస్తోంది. ఇదే తరుణంలో నెక్స్ట్ సంజయ్‌ని తప్పించి..జగిత్యాల బరీ నుంచి కవిత పోటీ చేస్తారని ప్రచారం వస్తుంది. ఇక ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిన శ్రావణి బిజేపిలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇక ఆమె..సంజయ్ ఓటమి కోసం పనిచేస్తానని శపథం చేశారు. చూడాలి మరి ఈ సారి జగిత్యాల రాజకీయం ఎలా ఉంటుందో.