అసోంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని గువాహటిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు వంద ఇళ్లు దగ్ధం అయ్యాయి. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దెబ్బతిన్నాయిని పోలీసులు తెలిపారు. కాకపోతే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయని వెల్లడించారు. ఓ అద్దె ఇంట్లో సిలిండర్ పేలడం వల్ల మంటలు చెలరేగాయని గుహవాటి పోలీసులు తెలిపారు.
సిలిండర్ పేలడంతో మంటలు ఒక్కసారిగా చుట్టుపక్కలంతా వ్యాపించాయని పోలీసులు వెల్లడించారు. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించి 10 ఇళ్లు దగ్ధం అయ్యాయని వెల్లడించారు. ఈ ఘటనలో దాదాపు 15 సిలిండర్లు పేలాయిని, రెండు కార్లు పూర్తిగా కాలిపోయాయని చెప్పారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 15 అగ్నిమాపక వాహనాలతో వచ్చి మంటలను ఆర్పివేశారు. ఘటనా స్థలానికి వెళ్లే రహదారి ఇరుకైనందున అగ్నిమాపక సిబ్బందికి రావడానికి ఆలస్యం అయ్యిందని తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు వంద మందిని రక్షించామని తూర్పు డీసీపీ సూర్జిత్ సింగ్‌తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.