మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి ఆమోదించాలనేది తమ ప్రధాన డిమాండ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తున్నారని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లుకు మాత్రం ఆమోదం రాలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసమే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నామని తెలిపారు.
“2014, 2018 ఎన్నికల్లోనూ బిల్లుపై బీజేపీ హామీ ఇచ్చింది. 300కు పైగా ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చినా బిల్లు ఆమోదించలేదు. మహిళా బిల్లుపై నోరు విప్పకుండా.. బిల్లు అంశాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. ఈనెల 10న మహిళా బిల్లుపై దీక్ష చేస్తామని మార్చి 2న పోస్టర్ రిలీజ్ చేశాం. మా దీక్షకు మద్దతిస్తూ విపక్షాలు ముందుకొచ్చాయి. మార్చి 10న దీక్ష చేస్తామనగానే 9న విచారణకు రావాలని ఈడీ సమన్లు ఇచ్చింది. ధర్నాకు సంబంధించి ముందస్తు కార్యక్రమాల వల్ల 11న వస్తానని చెప్పా. మహిళలను ఇంటికొచ్చి విచారించాలనే చట్టం చెబుతోంది. మహిళలను విచారించే విధానాలకు విరుద్ధంగా నన్ను విచారణకు పిలిచారు. మా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేంద్రం లక్ష్యంగా చేసుకుంది.” – కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ