జాతీయ పార్టీని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. దేశంలో చాలా పార్టీలకు రాజకీయం అనేది ఒక గేమ్ గా మారిందని.. తనకు మాత్రం రాజకీయమంటే ఓ టాస్క్ అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేర్చాలనేదే తన ఆశయమని చెప్పారు.
కర్ణాటకలో రాబోయే ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి జెండా ఎగుర వేయాలని కేసీఆర్ అన్నారు. వచ్చే ఏడాదిలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ బావుటా ఎగరాలన్నారు. దేశంలో రైతుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందన్న కేసీఆర్.. అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు టీఆర్‌ఎస్‌ను రాష్ట్రానికే పరిమితం చేస్తే ఎసా అని చాలా మంది తనను అడిగినట్లు చెప్పారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని, తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాలని కేసీఆర్ చెప్పారు. దేశ ప్రజల కోసమే బీఆర్‌ఎస్‌ను తీసుకువచ్చినట్లు వివరించారు. రైతు సంక్షేమమే ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మొదటి కార్యక్షేత్రాలు కర్ణాటక, మహారాష్ట్ర అని కేసీఆర్ స్పష్టం చేశారు. తొలుత అక్కడి రైతులకు మేలు జరిగేలా ప్రయత్నిద్దామని అన్నారు.