ప్రస్తుతం నేతిబీరకాయ చందంగా ఉన్న భారత దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నా మని చెబుతున్న మోడీ ప్రభుత్వం అందుకు తగిన ప్రణాళికను ప్రకటించినా.. ఆచరణలో మాత్రం యోగ్య మైన ఫలితాన్ని చవిచూడలేక పోతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ క్షీణతకు ప్రపంచ దేశాల్లో ఎదురవుతున్న సవాళ్లు కూడా కారణంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో అనేక సవాళ్లు తెరమీదికి వచ్చాయి. ప్రస్తుతం శనివారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్తిక మంత్రి నిర్మాలమ్మకు ఎదురవుతున్న సవాళ్లు ఏంటో చూద్దాం..
డిసెంబరు త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీ వృద్ధి 11 ఏళ్ల కనిష్ఠం 5 శాతానికి పరిమితం కావచ్చని ప్రభుత్వం అంచనా. అదేసమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి కట్టడి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, పన్ను ఆదాయ వసూళ్లు భారీగా తగ్గాయి.
ఈసారి బడ్జెట్ అంచనాల తో పోలిస్తే పన్ను ఆదా యం రూ.2 లక్షల కోట్ల కు పైగా తగ్గవచ్చని భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మార్కెట్ నుంచి మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మోడీ సర్కారుకున్న సమస్యల్లో నిరుద్యోగం ప్రదానంగా కనిపిస్తోంది. ఎన్‌బీఎఫ్‌సీల్లో ద్రవ్య సంక్షోభంతో చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా కార్పొరేట్ రంగ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఏటా కోట్లల్లో యువత జాబ్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది.
వీరికి ఉద్యోగా ల కల్పన సమస్యగా మారింది. ఇప్పుడు బడ్జెట్‌లో ఈ సమస్యపై ఎలాంటి ప్రణాళికను ప్రవేశ పెడతారో చూడాలి. అంతర్జాతీయ మందగమనం కారణంగా భారత ఉత్పత్తులకు విదేశాల నుంచి ఆర్డర్లు తగ్గాయి. దేశ ఆర్థిక వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఎగుమతులు గత ఏడాది ఏప్రిల్-నవంబరు కాలానికి 2 శాతం క్షీణించాయి. వీటి పురోభివృద్ధికి నిర్మలమ్మ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.