టీం ఇండియాలో మరో గోడను చూడలేమా…?

-

చాలా మందికి క్రికెట్ అంటే హడావుడిగా వచ్చి హడావుడిగా నాలుగు సిక్సులు కొట్టి, హిట్టర్ అనిపించుకోవాలి, ఐపియల్ లాంటి లీగుల్లో కీలక ఆటగాళ్ళు అవ్వాలి. సిక్సు కొట్టడమే క్రికెట్ అనుకునే రోజులివి. ఆటగాళ్ళు అందరూ దాదాపు అలాగే ఉన్నారు. పోనీ టెస్ట్ క్రికెట్ ఆడితే, డబుల్ సెంచరి చెయ్యాలి, సెంచరి చెయ్యాలి. కాని జట్టుని ఆదుకోవాలి అనే స్పృహ చాలా మంది ఆటగాళ్లకు తక్కువ. ఎక్కడో జట్టులో ఒకరో ఇద్దరో ఆటగాళ్ళు ఎప్పుడో ఒకసారి ఆడటం లేదా ఒక ఆటగాడి మీద ఆధారపడటం అనేవి మనం చూస్తున్నాం.

కాని టెస్ట్ క్రికెట్ లో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం ద్రావిడ్ స్థాయి ఆటగాడిని మాత్రం ఈ రోజుల్లో మనం చూడలేకపోతున్నాం. చాలా మంది ఆటగాళ్ళు ఆడితే అతివృష్టి ఆడకపోతే అనావృష్టి. టీం ఇండియా విషయానికి వచ్చి చూద్దాం. కెప్టెన్ కోహ్లీని మినహాయిస్తే ద్రావిడ్ తర్వాత మనం మూడు నాలుగు స్థానాల్లో ద్రావిడ్ స్థాయి ఆటగాడిని మనం చూడలేకపోయాం. గంటలు గంటలు క్రీజ్ లో నిలబడి స్ట్రైక్ రొటేట్ చేస్తూ, బౌలర్లను విసిగించి, వాళ్ళను మానసికంగా ఆటతో చుక్కలు చూపించి అలసిపోయే విధంగా చేయడం ద్రావిడ్ నేర్చిన క్రికెట్.

పరిస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు బౌలర్ అలసిపోవాలి. అప్పుడే మన౦ నిలబడగలం. అప్పుడే మ్యాచ్ చేజారకుండా ఉంటుంది. అందుకే పిచ్ అనుకూలంగా లేనప్పుడు బంతులు వదిలేసినా, ప్రత్యర్ధి బౌలర్లు బౌండరి లైన్ నుంచి రనప్ తీసుకుని, వేగంగా బంతులు విసిరినా కనీసం పిచ్ నుంచి బాల్ బయటకు వెళ్ళకుండా డిఫెన్స్ ఆడి, ఎదుటి వాళ్ళు మాటల యుద్దానికి మానసికంగా వేదించినా కనీసం వాళ్లకు మాటతో సమాధానం చెప్పకుండా, ఆటతో తర్వాతి బంతిని డిఫెన్స్ తో సమాధానం చెప్పగలిగే నేర్పు ద్రావిడ్ ది.

ఆ ఆటగాడిని మనం జట్టులో ఎప్పుడు చూస్తామా అని ప్రతి ఒక్కరు ఎదురు చూసే వాడే. ద్రావిడ్ రిటైర్ అయిన తర్వాత టెస్ట్ మ్యాచ్ లు చూసే వాళ్ళ సంఖ్య తగ్గి ఉండవచ్చని అన్నారు అంటే టెస్ట్ క్రికెట్ లో అతని మార్క్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అతను ఎదుర్కొన్న బౌలర్లు అందరూ అగ్రశ్రేణి బౌలర్లే. ద్రావిడ్ ని అవుట్ చేస్తే రెండు మూడు ఓవర్లలో అవుట్ చేసినట్టు. లేదా అతని వికెట్ వదులుకుని ఇతర ఆటగాళ్ళ మీద దృష్టి పెట్టడమే. స్ట్రైక్ రేట్ తక్కువ ఉందని వెక్కిరించినా సరే వందల కొద్దీ బాల్స్ మింగేసి,

మ్యాచ్ చేజార్చాడు అనే ఆరోపణలు వచ్చినా అతను మాత్రం తన శైలి మార్చుకోలేదు. క్రికెట్ కి కావాల్సింది పరుగులు కాదు, ప్రత్యర్ధిని ఎదుర్కోవడం, వాళ్ళను ఎదుర్కొని మ్యాచ్ లో మనం నిలబడటం అని చెప్పిన ఒకే ఒక్క ఆటగాడు ద్రావిడ్. అవును టీం ఇండియాలో మళ్ళీ ద్రావిడ్ ని ఎప్పుడు చూస్తాం…? ప్రత్యర్ధి కెప్టెన్ విసిగిపోయి క్యాప్ తీసి చెమట తుడుచుకునే రోజులు ఎప్పుడు వస్తాయి…? అందుకే టెస్ట్ అంటే ద్రావిడ్. ద్రావిడ్ అంటే టెస్ట్. ప్రత్యర్ధి కూడా ఫిదా అయిన ఆట అది. మళ్ళీ అలాంటి ఆటగాడిని టీం ఇండియా ఎప్పుడు చూస్తుందో…!

Read more RELATED
Recommended to you

Exit mobile version