రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సికింద్రాబాద్ అగ్నిప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందారు. మరో తొమ్మిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అగ్నిమాపక పోలీసు సిబ్బంది కీలక ఆధారాలు సేకరించారు.
ఈ అగ్నిప్రమాదం ఎలక్ట్రిక్ వాహనాల ఓవర్ ఛార్జింగ్ మంటలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మంటల ధాటికి ఒక్కసారిగా బ్యాటరీలు పేలడంతో వాహనాల టైర్లూ అగ్నికి ఆహుతయ్యాయి. వాటి నుంచి వెలువడిన కార్బన్‌మోనాక్సైడ్, లిథియం విషవాయువులు దట్టంగా వ్యాపించాయి. దీనికి ‘మష్రూమ్ ఎఫెక్ట్’ తోడవడంతో ప్రాణనష్టం జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. మంటలు వ్యాపించిన తీరు, కమ్మేసిన పొగ, వ్యాపించిన రసాయనాలు, విష వాయువుల ఆధారంగా ఇది ‘మష్రూమ్ ఎఫెక్ట్’గా నిపుణులు పేర్కొన్నారు.
మంటలు, దట్టమైన పొగ కలిసి వేగంగా పైకి వెళ్లడాన్ని ‘మష్రూమ్ ఎఫెక్ట్’ అంటారు. సాధారణంగా గాలి ఎక్కువగా లేని బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో అగ్ని ప్రమాదాల సమయంలో ఇలా జరుగుతుంది. పొగ కనిపించిన 12 సెకండ్లలోనే పేలుడు సంభవించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా అధికారులు అంచనా వేశారు.