మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి ఆయన మూడోసారి విచారణ కోసం వెళ్లారు. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24న సీబీఐ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు.
విచారణలో భాగంగా.. సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందని, వీటి ప్రకారం వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. నేడు విచారణకు రానున్న ఈ పిటిషన్‌లో వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ కానున్నారు.
మరోవైపు ఈకేసులో చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ ఖైదీలుగా ఉన్న సునీల్‌యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు గంగిరెడ్డి, దస్తగిరి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది. అనంతరం నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.