దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ, ఈడీ పలువురిని అరెస్ట్ చేసింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్న కుల్దీప్‌సింగ్, నరేంద్రసింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, సమీర్ మహేంద్రు, ముత్తా గౌతమ్‌లకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ముత్తా గౌతమ్‌లను అరెస్టు చేయకుండానే సీబీఐ ప్రత్యేక కోర్టు సాధారణ బెయిల్ ఇచ్చింది. వీరిలో అరుణ్ పిళ్లైను ఇటీవల ఈడీ ప్రశ్నించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ముత్తా గౌతమ్ మినహా మిగతా నిందితులు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లికి ఇప్పటికే సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే వీరిద్దరూ మాత్రం ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.