దేశవ్యాప్తంగా దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా అంతా కలిసి కుటుంబంతో సంతోషంగా వేడుకలు జరుపుకున్నారు. అయితే పండుగ పూట కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా బాణాసంచా పేల్చడం వల్ల పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీనగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ వాసులు నిన్న రాత్రి పండగవేళ ఆనందోత్సవాలతో బాణసంచా పేల్చుతూ సంబురాల్లో మునిగిపోయారు. కానీ అది కాస్త అగ్నిప్రమాదానికి దారి తీసింది. నోబుల్ అపార్ట్‌మెంట్‌పై ఉన్న సెల్ టవర్‌పై బాణాసంచా నిప్పురవ్వలు పడడంతో షార్ట్‌సర్క్యూట్ అయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు, అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్నవారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా బాణాసంచా కాల్చడంతో అపార్ట్‌మెంట్ వాసులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.