కేంద్రం తెస్తున్న ఈ కొత్త చట్టంతో జగన్‌కు ఇబ్బందులు..?

-

కేంద్ర ప్రభుత్వం మరో కొత్త చట్టం తీసుకు రాబోతుంది. దేశమంతటా అమలయ్యేలా.. విదేశీ మదుపర్లలో విశ్వాసాన్ని పెంచేలా ఈ చట్టం ఉంటుందని తెలుస్తుంది.

ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో బీజేపీతో సత్సంబంధాలు ఉండేవి. అవి క్రమేణా క్షీణిస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో జగన్ ఏం చేసినా మోడీని, అమిత్ షాను అడిగే చేస్తారని సాక్షాత్తూ విజయసాయి రెడ్డే చెప్పారు. అంతగా తమకు బీజేపీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని అని వైసీపీ నేతలు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ తిరగబడినట్టు కనిపిస్తోంది.

ఇప్పుడు ఏకంగా జగన్ కు వ్యతిరేకంగా ఓ కొత్త చట్టమే రాబోతోందట. చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా ప్రభుత్వానికి భారం పడేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారంటూ వాటిని సమీక్షిస్తామని జగన్ అధికారానికి వచ్చిన మొదటి రోజుల్లోనే చెప్పారు. ఇందులో ఎక్కువగా విద్యుత్ పీపీఏలు ఉన్నాయి. అయితే ఇలా చేయడం ద్వారా భారత్‌లో విదేశీ కంపెనీల పెట్టుబడులకు రక్షణ ఉండదన్న విమర్శలు వచ్చాయి.

అందుకే ఇప్పుడు కేంద్రం కొత్త చట్టం తెస్తోందట. దేశమంతటా అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చట్టాన్ని తీసుకొస్తేనే భారత్‌ తిరిగి విదేశీ మదుపర్లలో విశ్వాసాన్ని నింపగలదని కేంద్ర విద్యుత్తు శాఖ సహాయమంత్రి ఆర్‌.కె.సింగ్‌ తాజాగా అన్నట్టు తెలుస్తోంది. అందుకే భారత్‌లో విదేశీ కంపెనీల పెట్టుబడులకు రక్షణ కల్పించేలా త్వరలో కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురాబోతోందట. భారత్ లో తమ పెట్టుబడులకు తగిన రక్షణ ఉండడం లేదని కొన్ని విదేశీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందట.

అదే జరిగితే విద్యుత్ పీపీఏ ల వంటి ఒప్పందాల సమీక్ష కుదరదు. అంటే సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని కేంద్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టే లెక్క. ఈ వార్తే నిజమైతే.. జగన్ కు ముందు ముందు చిక్కులు తప్పకపోవచ్చు. ఆర్థిక ఒప్పందాల సమీక్షల కారణంగా చాలా డబ్బు ఆదా చేయొచ్చని జగన్ భావించారు. అందుకు అనుగుణంగా కొత్త పథకాలకు రూపకల్పన చేశారు. ఇప్పుడు అవన్నీ చిక్కుల్లో పడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version