మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ టీకాలను వేస్తామని కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలు టీకాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయనున్నాయి. కేంద్ర ప్రభుత్వం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్‌లకు ఈ మేరకు రుణాలను కూడా అందిస్తామని తెలిపింది. అయితే మే 1 నుంచి కోవిడ్ టీకాలను మెడికల్ స్టోర్లలో విక్రయించనున్నారా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
కోవిడ్ టీకాలను పెద్ద ఎత్తున వేయాలంటే అందుకు సిబ్బందితోపాటు కేంద్రాలు కూడా అవసరం అవుతాయి. కానీ ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నందున టీకాలను వేసేందుకు సిబ్బందికి కొరత ఏర్పడుతుంది. దీని వల్ల టీకాల పంపిణీ కార్యక్రమానికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. అదే మెడికల్ స్టోర్‌లలో టీకాలను విక్రయిస్తే ప్రజలు ఎవరికి వారు టీకాలను కొనుగోలు చేసి తమకు అవకాశం ఉన్న ప్రదేశంలో టీకాలను వేయించుకుంటారు. దీంతో భారీ ఎత్తున కోవిడ్ టీకాలను పంపిణీ చేయవచ్చు. కరోనా త్వరగా నియంత్రణలోకి వస్తుంది. అందుకనే కేంద్రం కోవిడ్ టీకాలను మెడికల్ స్టోర్‌లలో విక్రయించాలని చూస్తున్నట్లు తెలిసింది.
అయితే ప్రస్తుతం ప్రజలకు చెందిన ఫోన్ నంబర్లు, ఆధార్ వివరాలను తీసుకుని టీకాలు వేస్తున్నారు. దీంతో ఎంత మందికి టీకాలు వేశారనే విషయం కచ్చితంగా తెలుస్తుంది. అదే మెడికల్ స్టోర్‌లలో టీకాలను విక్రయిస్తే వివరాలను సేకరించడం వరకు బాగానే ఉంటుంది. కానీ అమ్ముడైన టీకాలను ప్రజలు తీసుకున్నారా, లేదా అనే వివరాలు తెలియవు. మరి ఈ విషయంలో కేంద్రం ఏం చేస్తుందో చూడాలి. మొత్తానికి మే 1వ తేదీ నుంచి భారీ ఎత్తున కోవిడ్ టీకాలను పంపిణీ చేస్తారని మాత్రం తెలుస్తోంది.