పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది కేంద్ర సర్కార్. లిఖితపూర్వక సమాధానమిచ్చారు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్.
1980 నాటి “గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్” ప్రకారం పూర్తి రిజర్వాయర్ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లు. ఎత్తు తగ్గించాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు మాకు సమాచారం లేదని… సమాధానంలో స్పష్టం చేశారు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్.
అటు పోలవరం ప్రాజెక్టు పురోగతి నివేదికను కేంద్రం ప్రభుత్వం పార్లమెంటు ముందుంచింది. 2017-18 ధరల మేరకు సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లు అని కేంద్రం వెల్లడించింది. 2019లో తమ వద్దకు వచ్చిన సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లు అని తెలిపింది. ప్రతిపాదిత అంచనాలను కేంద్ర జలశక్తి శాఖ సాంకేతిక సలహా కమిటీ అంగీకరించిందని కేంద్రం వివరించింది.