దేశంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై మరోసారి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. సీట్ల సంఖ్య పెంపు ఉద్దేశం ప్రస్తుతానికైతే ఏమీ లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) నిబంధన ప్రకారం 2026 తర్వాత చేపట్టే తొలి జనగణన లెక్కలను ప్రచురించేంత వరకూ ఇప్పుడున్న సీట్లను సర్దుబాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. అన్ని రాష్ట్రాల్లో 1971 జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ సీట్లు ఏర్పాటైనట్లు చెప్పారు.
అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే ఉద్దేశం లేదని మరోసారి కేంద్ర ప్రకటించిన నేపథ్యంలో.. సీట్ల సంఖ్య పెంపుపై టీఆర్ఎస్ ఆశలపై నీళ్లు పడ్డట్లయింది. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని ఉద్దేశంతో ఆ పార్టీ విపరీతంగా వలసలను ప్రోత్సహించింది. ఒక్క నియోజకవర్గంలో ముగ్గురు, నలుగురు ఆశావహులు పెరిగారు. కేంద్రం నిర్ణయంతో వచ్చే ఎన్నికల్లో వారికి సీట్లను సర్దుబాటు చేయడం టీఆర్‌ఎస్ అధిష్ఠానానికి కత్తి మీద సాము లాంటిదే.