కరోనా వైరస్ దేశంలో ఎక్కువగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రజలు అందరూ కూడా మాస్క్ లు కొనుక్కోవడానికి రెడీ అవుతున్నారు. మెడికల్ షాపుల చుట్టూ మాస్క్‌లు, శానిటైజర్ల కోసం పరుగులు పెడుతున్నారు. దీనితో కొందరు వ్యాపారులు దొరికిందే మంచి తరుణం అని భావించి భారీగా వసూలు చేయడం మొదలుపెట్టారు. మెడికల్ షాపుల యజమానులు ఒక్కో మాస్క్ వంద కు కూడా అమ్ముతున్నారు.
దీనితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని విధాలుగా ప్రభుత్వాలు హెచ్చరించినా సరే మారే పరిస్థితి కనపడటం లేదు. దీనితో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కరోనా వైరస్ మాస్క్‌లు, శానిటైజర్ల ధరలను ఖరారు చేసింది. మాస్క్‌ల ధరలు రూ.8, రూ.10గా కేంద్రం నిర్ణయించింది. అదే విధంగా 200 ML శానిటైజర్ ధర రూ.100గా ఖరారు చేసింది. ఈ ఆదేశాలు మార్చి 21 నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.
ఈ సందర్భంగా కీలక హెచ్చరికలు చేసింది. ప్రజల భయాన్ని క్యాష్ చేసుకుంటూ, మాస్క్‌లు, శానిటైజర్లను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. రిటైల్ దుకాణాలు, ఆన్‌లైన్ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. కోవిడ్-19పై సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలకు నమ్మవద్దని, మాస్క్‌లు అందరూ ధరించాల్సిన అవసరం లేదని కేంద్రం సూచించింది. వ్యక్తిగత దూరం చాలని తెలిపింది.