కరోనా మహమ్మారి కారణంగా మనిషి జీవితం అతలాకుతలం అయిపోయింది. అసలే ఆర్ధికంగా నష్టపోయి తీవ్ర సంక్షోభంలో ఉంటే.. ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో మనిషికి మరింత సమస్యగా మారింది. ఒకవైపు కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి.. అలాగే ఉల్లి ధర కూడా ఆకశాన్ని అంటుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను ధర రూ.30 వేలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లిధర ప్రస్తుతం రూ.40గా ఉంది. అలాగే ఇటీవల కురిసిన వర్షాలతో వేలాది ఎకరాల్లో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో ఉల్లి సరఫరా పడిపోయింది. దీని ఫలితంగా నెల వ్యవధిలోనే ఉల్లి ధర మూడు రెట్లు పెరిగింది.
ఈ నేపధ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశంలోని అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. తాము చెప్పేవరకు ఉల్లి ఎగుమతులు నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. వ్యాపారులు ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లి నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని కేంద్రం భావిస్తోంది.