అమ్మా భారతమ్మ.. సీఎం జగన్ ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని చురకలు అంటించారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ముఖ్యమంత్రి జగన్… తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని మరింత అప్పుల పాల్జేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా జిల్లాకో ఎయిర్ పోర్టు కడతాననడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
పోలవరం, ఉత్తరాంద్రా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి ఏమిటీ తుగ్లక్ నిర్ణయాలు.. అంటూ రెచ్చి పోయారు. రెండో వేవ్ కరోనాలో క్వారెంటైన్ సెంటర్ల నిర్వహకులు ఇంతవరకు చెల్లింపులు చేయలేదు.. మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు ఇప్పటికీ బకాయిలే ఉన్నాయని మండిపడ్డారు. సంపద సృష్టించడం చేతకాక, OTS పేరుతో పేద ప్రజల దగ్గర బలవంతపు వసూళ్ళు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి చెత్త, డ్రైనేజి మీద పన్నులు వసూలు చేస్తున్నారని… అయినా జిల్లాకో ఎయిర్ పోర్టు కడతావని చెప్పడానికి సిగ్గు లేదా …? అని జగన్ పై నిప్పులు చెరిగారు. సీఎంకు ఏదో అయిందని అనుమానంగా ఉంది.వెంటనే ఆస్పత్రిలో చూపించండి… లేదంటే, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారంటూ ఎద్దేవా చేశారు..