ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. ధనము లేనిదే ఈ పని జరగదు కాబట్టి అన్నింటికీ ధనమే మూలం . యావత్ జగతి లో డబ్బుకు లొంగని వారు ఉంటారా చెప్పండి.
డబ్బు మీద ఆశతో చాలామంది ఎన్నో కష్టాలు పడినా వారికి ఎంత దక్కే ప్రాప్తం వుందో అంతే దక్కుతుంది. డబ్బు సంపాదించాలంటే నీటి మీద నీరు అని రాసినంత కష్టం.ఖర్చు పెట్టడం అంటే ఇసుక మీద ఇసుక అని రాసినంత సులభం. కొన్నిసార్లు సంపదలు సంపాదించడానికి ఎంత ప్రయాసపడతామో కానీ ఖర్చు పెట్టేందుకు చాలా ఆలోచిస్తాం.కష్టపడకుండా వచ్చిన సొమ్మును మాత్రం విచ్చలవిడిగా ఖర్చయిపోతుంది. ఆగాన వచ్చింది భోగాన పోతుందని సామెత కూడా వుంది.
సంపాదించిన డబ్బు చిటెకెలో ఖర్చు పెట్టొచ్చు . కానీ ఖర్చు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు. డబ్బు ఎంత పొదుపుగా వాడితే అంతా మంచిదని సూచించాడు. లేకపోతే ఎన్నో సమస్యలకు ఆస్కారం అవుతుందని హెచ్చరించారు.ఏది ఎప్పుడు అత్యవసరమో దాన్ని తీర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.అంతేకాని అవసరం లేనివి, కంటికి కనపడినవన్నీ కొనుక్కుంటే అప్పుల సమస్యలు చుట్టూముట్టే అవకాశం ఉంటుంది.
పొదుపు మంత్రం :
జీవితంలో ధనవంతులు కావాలంటే పొదుపే అసలైన సూత్రం అంటారు చాణక్యుడు. కాబట్టి సంపాదించిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా కొంత పొదుపు చేస్తే భవిష్యత్ అవసరాలను తీర్చే ఔషదం అవుతుంది . సంపాదింంచిన డబ్బును ఖర్చులకు 60% వాడి,40%లేక 30%పొదుపు చేయాలనే నియమం పెట్టుకొని పొదుపు చేస్తుండాలి. ఇలాంటి చేస్తే ధనవంతుడు అవడమే కాకుండా మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండగలుగుతారు. అంతే కానీ ఎప్పుడు వచ్చింది అప్పుడే ఖర్చు పెట్టేస్తే భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అలాగని పిసినారిగా మారమని కాదు.అవసరాలు పోగా మిగిలిన డబ్బును పొదుపు చేయడం ఉత్తమం. డబ్బు విషయంలో అందరు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి.పొదుపు కోసం కూడా నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉంటుంది.
కష్ట కాలంలో పొదుపు చేసిన ధనమే సాయం అందిస్తుంది . ఏ జబ్బు వచ్చినా ఆదుకునేది డబ్బే. డబ్బు స్నేహితుడిలా, శ్రేయోభిలాషి లా ఆదుకుంటుంది. రక్షణ ఇస్తుంది.ముందస్తుగా జాగ్రత్తగా వ్యవహరించి దాచుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. త్వరలో లక్షధికారులు కావాలంటే పొదుపు ఒక్కటే సరైన మార్గమని ఆచార్య చాణక్యుడు పూర్వ కాలంలోనే బోదించడం గమనించాల్సిన విషయమే.