తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అమరావతి రైతుల ఉద్యమాన్ని తన భుజాన వేసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలిచి ముందుకి నడిపిస్తుంది. వాస్తవానికి చంద్రబాబుకి అమరావతి అనేది జీవన్మరణ సమస్య. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడిన అంశం. ఆర్ధికంగా, రాజకీయంగా కూడా ఆ పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. దీనితో చంద్రబాబు అన్ని విధాలుగా రాజకీయ పార్టీలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.
అధికారంలో ఉన్నప్పుడు దూరం చేసుకున్న కొందరిని దగ్గర చేసుకుంటున్నారు. కొన్ని రోజులుగా బిజెపికి దగ్గరయ్యే విధంగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు ఇప్పుడు రూటు మార్చారు. బందరులో జోలేపట్టి పట్టి విరాళాలు సేకరించిన చంద్రబాబు నాయుడు, అనంతరం సభలో మాట్లాడుతూ పవన్ పోరాటాలు చేసి పైకి వచ్చారు, వైసీపీ నేతలు కేసులపై పోరాటం చేసారు అన్నట్టు మాట్లాడారు. మరి పవన్ చేసిన పోరాటాలు ఏంటో ఆయనకే తెలియాలి గాని,
ఇప్పుడు జనసేన పార్టీని దగ్గర చేసుకోవడానికి ఆయన పాకులాడుతున్నారు అనే విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది. పవన్ ద్వారా లాంగ్ మార్చ్ ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు. విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళే ఆలోచన చేస్తున్నారు. ఇందుకు పవన్ ఒప్పించడానికి జనసేన కార్యాకర్తలను సమీకరించడానికి ఆయన ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కి ఉన్న ఫాలోయింగ్ ని వాడుకుంటే అమరావతి ఉద్యమంలో తనకు ఒక అండ దొరుకుతుందని, సామాజిక వర్గాల పరంగా కూడా కలిసి వస్తుందని బాబు భావిస్తున్నారు.