తెలంగాణ రాజకీయాల్లో షర్మిలకు అవకాశం ఉందా..?

-

జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఉప్పెనలా విరుచుకుపడిన షర్మిల మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారారు. 16 నెలల పాటు జైలు లో ఉన్న అన్నకు అండగా , వైసీపీ పార్టీ జెండాను పాదయాత్ర రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఒక ప్రాంతీయ పార్టీగా వైసీపీ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ సానుభూతి ప్రకంపనలు సృష్టించడానికి షర్మిల ఇంధనమై ఉపయోగపడ్డారు. ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటున్నారు. అసలు తెలంగాణ రాజకీయాల్లో షర్మిలకు అవకాశం ఉందా…

తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. జగన్ ఏపీలో పని చేసుకుంటున్నారని, తాను తెలంగాణకే పరిమితమౌతానని చెప్పారు షర్మిల. జగన్ ఆశీస్సులు ఉన్నాయనే అనుకుంటున్నానని షర్మిల చెబితే.. పార్టీ వద్దన్నా షర్మిల ముందుకెళ్తున్నారని వైసీపీ ప్రకటించింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం.. రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల.. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని అందరూ కోరుకుంటున్నట్టు చెప్పారు.

తెలంగాణలో వైసీపీ ఉండాలని బలంగా కోరుకుంటున్నవాళ్లు చాలా మంది ఉన్నారని, ఇప్పుడు షర్మిల జిల్లా నేతలతో భేటీల్లో కూడా వాళ్లే కనిపిస్తున్నారని వాదన వినిపిస్తోంది. ఇలాంటి నేతలు, ఇతర పార్టీల్లో ఉన్న వైఎస్ సానుభూతిపరులు అందరూ షర్మిల వైపే చూసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ పనులు కూడా ప్రారంభించారని, వైఎస్సార్టీపీ, రాజన్నరాజ్యం పేరుతో ఈసీకి అప్లికేషన్ కూడా పెట్టారని ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. కొత్త పార్టీ జెండా కూడా ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. షర్మిల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కొందరు అభిమానులు ప్రదర్శించిన జెండాపై కూడా చర్చ జరుగుతోంది.

షర్మిలకు రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇమేజ్ తో పాటు , ఆమెకు సొంతంగా తెలంగాణలో పట్టు ఉండటం, గతంలో ఆమె తెలంగాణలో నిర్వహించిన పాదయాత్ర సమయంలో ఆమెకు విశేష ఆదరణ లభించడం వంటివన్ని లెక్కలు వేసుకుని ఇప్పుడు ఆమె పొలిటికల్ గా తెలంగాణ యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ముందుగానే సమగ్రంగా ఒక సర్వే కూడా నిర్వహించారనే అభిప్రాయం వినిపిస్తోంది. షర్మిల ఆషామాషీగా రాజకీయాల్లోకి రావడం లేదని, పక్కా స్కెచ్ ఉందని కూడా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే షర్మిల మాత్రం తన భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. జిల్లా నేతలతో భేటీలు పూర్తయ్యాకే.. వివరాలు చెబుతానంటున్నారు.

అసలు తెలంగాణలో కొత్త పార్టీకి అవకాశం ఉందా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. షర్మిల చెబుతున్న రాజన్న రాజ్యం ఫార్ములా తెలంగాణలో వర్కవుట్ అవుతుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో ఒడిదుడుకుల్ని తట్టుకుని.. షర్మిల ఎలా నిలబడతారనేది కూడా ఆసక్తికరమే.తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీకి అవకాశం ఉందా.. అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ చాలా పటిష్ఠమైన స్థితిలో ఉంది. ప్రతిపక్షంగా బీజేపీ కూడా బలంగా పుంజుకుంటోంది. అటు కాంగ్రెస్ బలహీనపడినా.. పూర్తిగా తీసిపారేసే స్థితిలో అయితే లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ కు ప్రతి గ్రామంలోనూ ఎంతోకొంత క్యాడర్ ఉంది. ఈ పార్టీల్ని తట్టుకుని షర్మిల ఎలా నిలబడతారనేది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version