ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి వరుస విజయాలు దక్కించుకున్నారు. 2009లోనే రాజకీయాల్లోకి వచ్చిన గవర్నమెంట్ డాక్టర్ స్వామి. ఉత్తమ వైద్యుడిగా ఆయనకు పేరుంది. అయితే.. ఉత్తమ రాజకీయ నేతగా మాత్రం ఆయన వేస్తున్న అడుగులకు స్తానిక టీడీపీనే ఎసరు పెడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈయన వాదన ఇలా ఉంటే.. స్తానికంగా ఆయన రెండుసార్లు విజయం సాధించినా.. తమకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని .. టీడీపీ నాయకులు చెబుతున్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.
గత ఏడాది ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వైసీపీ పెనుగాలులు వీచాయి. జగన్ సునామీలో కీలక టీడీపీ నాయకులు కూడా చేతులు ఎత్తేశారు. అయితే. కొండపి ఎస్సీ నియోజకవర్గంలో మాత్రం స్వామి విజయం దక్కించుకున్నారు. వెయ్యి పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. అదే సమయంలో పార్టీలో అతి తక్కువ మంది మాత్రమే విజయం సాధించారు. దీంతో సహజంగానే రాష్ట్రస్థాయి నేతగా ఎదగాలనే ఆలోచన మెరిసింది స్వామికి.
దీంతో ఆయన నియోజకవర్గం సమస్యలు వదిలేసి.. రాష్ట్ర స్థాయి సమస్యలపై దృష్టి పెట్టడం ప్రారంభించారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులపై స్పందిస్తున్నారు. ఇదే.. ఆయనకు స్థానిక టీడీపీ నేతలకు మధ్య గ్యాప్ పెంచేసింది. స్వామి రెండు సార్లు విజయం సాధించినా.. తమకు ఏమీ చేయడం లేదని ఇటీవల కాలంలో కమ్మ సామాజిక వర్గం నేతల నుంచి భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ నియోజకవర్గమే అయినప్పటికీ.. కమ్మ వర్గం డామినేషన్ ఎక్కువగా ఉండడంతో వారి మాటే పైచేయిగా సాగుతోంది.
అయితే.. ఇవన్నీ.. వైసీపీ చేస్తున్న కుయుక్తులు అంటూ.. స్వామి కొట్టి పారేస్తున్నారే తప్ప..క్షేత్రస్థాయిలోనూ ఆయన పర్యటించి.. పరిస్థితి తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో చంద్రబాబును కలిసి స్వామిపై ఫిర్యాదు చేయాలని టీడీపీ నాయకులు నిర్ణయించుకోవడం ఇప్పుడు నియోజకవర్గంలో కాకపుట్టిస్తోంది. మరి బాబు ఎలా రియాక్ట్ అవుతారో ? చూడాలి.