తారకరత్న భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌తో కలిసి మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. అనంతరం తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు తారకరత్న భౌతికకాయానికి ఆయన సోదరులు కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ నివాళులర్పించారు. తారక్ పార్థివ దేహాన్ని చూసిన భావోద్వేగానికి గురయ్యారు.
‘‘తారక్ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు మాకు దూరమై మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
బావా అంటూ ఆప్యాయంగా పిలిచే తారకరత్న గొంతు ఇక వినిపించదన్న విషయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని నారా లోకేశ్ అన్నారు. ‘నేనున్నానంటూ నా వెంట నడిచిన తారకరత్న అడుగుల చప్పుడు ఆగిపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది’ అని ట్వీట్ చేశారు.