టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడుస్తున్నారనే వార్త ఏపీలో మళ్లీ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఎన్నికలకు ముందు కూడా జనసేన, టీడీపీల మధ్య స్పష్టమైన అవగాహన ఉన్నదనే ప్రచారం జరిగింది. అయితే అదంతా కేవలం దుష్ప్రచారం మాత్రమే అని, ఇరు పార్టీల ప్రతిష్టను ప్రజల్లో పలుచన చేసేందుకు వైసీపీ నేతలు ఆడుతున్న నాటకమని ఆయా పార్టీల నేతలు తేలిగ్గా కొట్టిపారేశారు. అయితే తాజాగా అధికార వైసీపీ నేతల ఆరోపణలను నిజం చేసేలా టీడీపీ, జనసేన మధ్య బంధం మరోసారి బహిర్ఘతం అవడం చర్చనీయాంశం అవుతోంది.
రాజధాని తరలిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ స్పందించారు. శుక్రవారం రాజధాని గ్రామాల్లో పర్యటించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని ఐనవోలు, ఉప్పలపాడు, నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు గ్రామాల్లో ఆయన పర్యటన సాగింది. అయితే సమస్యలు తెలుసుకునే పేరిట పవన్ చేసిన పర్యటనలో పలువురు టీడీపీ నేతలు పాల్గొనడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
జనసేన పార్టీ కార్యక్రమంలో టీడీపీ నేతలు హంగామా చేయడం గమనార్హం. రాజధాని తరలిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై పవన్‌కళ్యాణ్ ఆయా గ్రామాల్లోని స్థానికులతో మాట్లాడారు. రాజధాని తరలింపునకు జనసేన వ్యతిరేకమని, రాజధాని పేరుతో దోపిడీలకు, అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు ఉంటే.. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత వరకూ బాగానే ఉన్నా అసలు జనసేన పార్టీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొనడం ఏమిటనే ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తోంది.
మరోపక్క చంద్రబాబు ఆదేశంతోనే పవన్ కళ్యాణ్ రాజధానిలో పర్యటిస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక వైసీపీని ఎదుర్కునేందుకు భవిష్యత్‌లో టీడీపీతో జనసేన జట్టు కట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.