ఓటమి భయంతోనే వైసీపీ నేతలు, కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. ‘ఎన్నికలు ముగిసినా వైసీపీ నేతలపై దాడులు ఆగటం లేదు. ప్రణాళికా బద్ధంగా మా పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారు. అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారు అని మండిపడ్డారు. అల్లర్లు, దాడులకు చంద్రబాబే బాధ్యుడు. ఫలితాల తర్వాత బాబు పారిపోవటం ఖాయం’ అని ఆయన అన్నారు.
కాగా రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు రాళ్లు, రాడ్డు, కర్రలు, కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడుల చేసుకున్నారు. ఈ దాడుల్లో చాలా మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది.పలువురు అధికారులను బదిలీ చేసింది. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ అల్లర్లపై ఇప్పటికే ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.