టీడీపీ పార్టీ సీనియర్ నేతలతో నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం భేటి అయ్యారు. అమరావతిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యచరణ, పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ మేరకు రైతుల సమస్యలపై ఉద్యమించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఇటీవల వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయంపై రైతులు ఆందోళన చెందుతున్నారని టీడీపీ సీనియర్ నేతలు తెలిపారు. రైతులకు అండగా ఉంటూ రైతు పోరుబాట పేరిట టీడీపీ బహిరంగ సభలు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగింపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సదస్సులు నిర్వహించనుందన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రైతు పోరుబాట పేరిట టీడీపీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. సీఎం సొంత జిల్లా కడప నుంచే టీడీపీ పోరుబాట సదస్సు ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ నెల 20న కడప, 25న నెల్లూరు, జులై 1న కాకినాడ, జులై 7న విజయనగరం, జులై 13న విజయవాడలో రైతు పోరుబాట సదస్సులు జరుగుతాయన్నారు. రైతులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి రావాలన్నారు. సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.