ఏపీ సీఎంగా జగన్ అధికారం చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపుగా ఆగిపోయాయి. గత ప్రభుత్వం ఓకే చేసిన టెండర్లలో వందల కోట్ల రూపాయల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందుకే ఈ ప్రాజెక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నామని చెబుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
అయితే రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రధాన ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని వల్ల ప్రాజెక్టు భద్రత దెబ్బతింటుందని అంటున్నారు. అంతే కాదు. ఆలస్యం జరిగితే.. ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని చెబుతున్నారు. జగన్ మూర్ఖపు ధోరణితో పోలవరం ప్రాజెక్టు భద్రత, నాణ్యతలతో ఆడుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శిస్తున్నారు.
రాష్ట్ర భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకుంటే జగన్ రీటెండరింగ్ లో ముందుకు వెళ్లేవారు కాదని చంద్రబాబు అంటున్నరాు. సీఎం బంధువు పీటర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జగన్ ముందుకు పోతున్నారని విమర్శిస్తున్నారు. కేంద్రం చెప్పినా, నిపుణులు చెప్పినా ఈ ప్రభుత్వం వినకుండా ముందుకు పోతోందని. పోలవరం ఆపడం దుర్మార్గమైన చర్య అని చంద్రబాబు తాజాగా తన విమర్శలకు పదును పెట్టారు.
ఒక బోటు మునిగిపోతే ఇంత వరకు చెప్పలేని వాళ్ళు పోలవరం రీటెండరింగ్ గురించి మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడుతున్నారు. పోలవరం ఒక కప్లికేటెడ్ ప్రాజెక్టు, 55లక్షల క్యూసెక్కుల నీటి ని దృష్టిలో పెట్టుకుని దీనిని డిజైన్ చేశారు.. రెవర్స్ టెండరింగ్ పేరుతో అనుకున్న వ్యక్తికి ప్రాజెక్టు ను రిజర్వ్ చేసేసుకున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
అంతేకాదు.. జగన్.. నిపుణుల కమిటీని కాదని ముందుకెళ్తున్నారని.. రేపు ఏదైనా జరగరానిది జరిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క గ్రామం కూడా మిగలదని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. నచ్చిన సంస్థకు పనులు ఇచ్చేందుకు భద్రతను ఫణంగా పెట్టి జగన్ ముందుకు పోతున్నారని అంటున్నారు చంద్రబాబు. అనుకున్న వ్యక్తికి చెందిన సంస్థ ప్రాధమిక అర్హత సాధించకపోవటంతో అందుకు తగ్గట్లుగా నిబంధనలు మార్చారని విమర్శిస్తున్నారు.
55లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండే చోట నాణ్యత ప్రమాణాలు లేని సంస్థకు ప్రాజెక్టు కట్టబెట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. తమ ఇంటికి నోటీస్ అంటించిన అంత సులువు …పోలవరం కట్టడమని జగన్ అనుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్న చంద్రబాబు.. సీఎం కి చేతకాకపోతే నిపుణులు చెప్పింది అయినా వినాలని సలహా ఇస్తున్నారు.