పెగాసస్ స్పై వేర్ వివాదంలో టీడీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరుక్కోనున్నారా? లేదా కేవలం ఇదంతా కొద్ది రోజుల హంగామాకే పరిమితం కానుందా? ఇవే ఇప్పుడు పెను చర్చకు తావిస్తున్నాయి. ఆ రోజు టీడీపీ సర్కారు హయాంలో విపక్ష సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ కు గురి అయ్యాయని భూమన కరుణాకర్ రెడ్డి లాంటి సభా కమిటీ బాధ్యులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ చర్యపై సమగ్ర విచారణ చేసేందుకు మరియు చేయించేందుకు సిద్ధం అవుతున్నారు. వీటిపై పూర్తిగా చర్చించేక విపక్ష నేతలకు నోటీసులు ఇచ్చి, తరువాత కమిటీ ముందు హాజరు అయి వివరణ ఇవ్వమని అడిగే ఛాన్స్ కూడా ఉంది.
ఒకవేళ ఆరోపణలు నిరూపణ చేసే క్రమంలో దర్యాప్తు బృందాలు ఆధారాలు ఏమయినా సేకరించగలిగితే, వాటిని సభా కమిటీ పరిశీలించి తరువాత చర్యలకు ఉపక్రమించవచ్చు. గతంలో రాష్ట్రం విడిపోయాక ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ పెను వివాదానికి దారి తీసింది. అటు తరువాత పరిణామాల నేపథ్యంలో తన ఫోన్ ను తెలంగాణ పోలీసులు ట్యాప్ చేశారని ఆరోపణలు చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంచలనమే నమోదు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు ఫోన్ల ట్యాపింగ్ విషయం తెరపైకి రావడం, వీటిపై వైసీపీ సర్కారు విచారణకు సిద్ధం కావడం అన్నవి ఇరు రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిని పెంచుతున్న పరిణామాలే!
ఆ రోజు చంద్రబాబు స్పందించారు. ఏపీ అసెంబ్లీలో పెగాసెస్ వ్యవహారం ఇరు పక్షాల మధ్య వాగ్యుద్ధం రాజేసింది. తరువాత ఎందుకనో ఆ వివాదం చల్లారిపోయింది.
తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వాన ఏర్పడ్డ సభా కమిటీ ఈ వ్యవహారాన్ని మరో సారి తెరపైకి తేవడంతో ఇదంతా చంద్రబాబు దూకుడుకు కళ్లెం వేసేందుకే అని ప్రధానంగా ఓ మీడియా నుంచి వినిపిస్తున్న మాట.పెగాసస్’ దోషులను ప్రజల ఎదుట నిలబెడతాం, పూర్తి సమాచారం వెలికితీసి చంద్రబాబు నిర్వాకాన్ని బయటపెడతాం అని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యలు చేసి, సంచలనాలకు కేంద్రబిందువు అయ్యారు. జూలై 5, 6 తేదీల్లో మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించామని భూమన చెబుతున్నారు. దీంతో మరోసారి పూర్తిగా చర్చించాకే ఈ విషయమై పూర్తి వివరాలు వెల్లడించేందుకు సభా కమిటీ నిర్ణయించింది. ఇక టీడీపీ ఏమంటుందో ?