విజయవాడలో డాక్టర్ రమేశ్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని… సినీ నటుడు రామ్ ట్వీట్ చేస్తే హీరో రామ్ సినిమాలు ఆడనివ్వబోమని వైఎస్ఆర్సిపి నాయకులు వ్యాఖ్యలు చేయడం హేయమంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కరోనా కంటే కుల వైరస్ ఉద్ధృతంగా ఉందని రామ్ ట్వీట్ చేయడం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు.
తెలుగుదేశంపై తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి… గత 15 నెలలుగా అదే పద్ధతి కొనసాగిస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల పేరుతో వైఎస్ఆర్సిపి అవినీతికి పాల్పడిందని… ఎకరం రూ.5 లక్షలు ఉండే భూమిని రూ.50 లక్షలకు కొన్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆధారాలతో సహా అవినీతి బయటపడినా ఇప్పటికీ చర్యల్లేవని మండిపడ్డారు.
కరోనా సంక్షోభంలోనూ వైఎస్ఆర్సిపి నేతలు రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టకుండా.. టిడిపి నేతలపై తప్పుడు కేసులు ఎలా పెట్టాలా.. వారిని జైళ్లకు ఎలా పంపాలా అని ఆలోచిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ వైఖరి వల్ల రాష్ట్రం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు.