కుర్చీ పోయినా.. కలలు పోలేదన్నట్టుగా ఉంది టీడీపీ పరిస్థితి. గడిచిన ఐదేళ్ల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చి.. మీడియాలో హైలెట్ కావడం, తన వారికి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేలా చూడడం బాబుకు బాగా అలవాటైందనే విషయంలో టీడీపీలో చర్చకు వచ్చేది. ఈ క్రమంలోనే ఆయన ప్రతి ఏటా జూన్ 2ను నవ నిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ పండగ నిర్వహించేవారు. దీనికి పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి నిధులు కూడా విడుదల చేసేవారు.
ఇంతకీ.. మనందరం మరిచిపోయినా.. బాబు ఆయన తమ్ముళ్లు మాత్రం నేటికీ గుర్తు పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణలుగా ఉమ్మడిరాష్ట్రం అధికారికంగా విడిపోయిన రోజే జూన్ 2. ఈ రోజు ను తెలంగాణలో ఘనంగా పండగ మాదిరిగా చేసుకుంటారు. మరి ఏపీలో… రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు కాబట్టి జూన్ 2 ఇక్కడ పండగ ఎలా అవుతుంది? అయినా కూడా చంద్రబాబు దీనిని పండగ చేశారు. తనదైన శైలిలో నవనిర్మాణ దీక్ష అని పేరు పెట్టారు. అంటే.. ఆ రోజు ఉదయంనుంచి సాయంత్రం వరకు .. రాష్ట్ర పరిస్థితులపై చర్చించి.. ప్రతిజ్ఞలు చేసి.. తీర్మానాలు చేసుకోవాలని ఆయన గతంలో చెప్పారు.
ఈ క్రమంలోనే ప్రతిజ్ఞ సాగే గంట సమయానికి నీళ్ల ప్యాకెట్లు, బిస్కెట్లు, డ్రింక్, మచ్చిగ ప్యాకెట్లకు కోట్ల రూపాయల్లో ప్రజల ధనాన్ని పంచేవారు. 2018లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో విజయవాడ బెంజిసర్కిల్ వద్ద సీఎం హోదాలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పట్టుమని రెండు వేల మంది కూడా రాలేదు. భారీ ఎండలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయినాకూడా.. ఈ కార్యక్రమం ఖర్చు కింద 5 కోట్ల రూపాయలకు జీవో ఇచ్చేశారు. తర్వాత.. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో 2 కోట్లు కుదించారు. ఇదీ నవనిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు చేసిన పందేరం. కాగా, తాజాగా జూన్ 2 జగన్ ఎలాంటి కార్యక్రమం నిర్వహించకపోవడంతో అదేమనమైతే.. ఏదైనా చేసేవాళ్లం .. అంటూ తమ్ముళ్లు నిట్టూర్చారన్నమాట!!