ఛాన్స్ దొరికింది.. బాబు విశ్వ‌రూపం చూపించారు.. ఇంత‌లోనే చ‌తికిల ప‌డ్డారు..!

-

ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న చంద్ర‌బాబుకు అనూహ్యంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే అవ‌కాశం క‌ల్పించింది. అదే.. అచ్చ‌న్నాయుడిని అరెస్టు చేయ‌డం. ఏసీబీ అధికారులు శుక్ర‌వారం ఉద‌య‌మే అచ్చ‌న్నాయుడి ని శ్రీకాకుళం జిల్లాలో ఆయ‌న స్వ‌గృహంలో అరెస్టు చేశారు. దీంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఒక్క‌సారిగా రెచ్చిపోయారు. ఇంకేముంది.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను అణిచేస్తున్నారంటూ.. ఆయ‌న మొద‌లు పెట్టిన ప్రచారం.. అనూహ్యంగా ఓ రెండు గంట‌ల్లోనే యూట‌ర్న్ తీసుకుంది. అచ్చ‌న్నాయుడి అరెస్టును వెంట‌నే చంద్ర‌బాబు వేరే కోణంలో చూడ‌డం ప్రారంబించారు.

ఇక‌, బాబు పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా నేత‌లు కూడా ఇదే కోణంలో మాట్లాడడం మొద‌లు పెట్టారు. అచ్చ‌న్న బీసీ నాయ‌కుడుని, ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం అంటే.. బీసీల‌ను అణిచివేయ‌డ‌మ‌ని టీడీపీ నేత‌లు ప‌ల్లవి అందుకున్నారు. బీసీలంటే.. జ‌గ‌న్‌కు ప‌డ‌ద‌ని, కేవ‌లం త‌న రెడ్డి సామాజిక వ‌ర్గం మాత్ర‌మే ఏపీలో ఉండాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ని, అందుకే .. బీసీ వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బీసీల త‌ర‌ఫు న అసెంబ్లీలో గ‌ళం వినిపిస్తున్న అచ్చ‌న్న‌ను అరెస్టు చేయ‌డం.. బీసీల‌ను అరెస్టు చేయ‌డ‌మేన‌ని టీడీపీ నేత‌లు అనుకూల మీడియా ఛానెళ్ల‌లో రెచ్చిపోయారు.

వాస్త‌వానికి అచ్చ‌న్న అరెస్టుకు బీసీ వ‌ర్గాల అణ‌చివేత‌కు ఏమైనా సంబంధం ఉందా? అచ్చ‌న్న ఎక్క‌డైనా బీసీల కోసం ఉద్య‌మం చేస్తే.. ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఆయ‌న‌ను అరెస్టు చేస్తే. ఖ‌చ్చితంగా ఇదే వ్యాఖ్య‌లు చేయొచ్చు. కానీ, వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను నొక్కేశార‌ని, అదికూడా కార్మికుల‌కు ఇచ్చే ఔష‌ధాల విష‌యంలో మోసం చేశార‌ని ఏసీబీ అధికారులు ప్రాధ‌మికంగా నిర్ధారించ‌డం గ‌మ‌నార్హం. అయితే, దీనిని కూడా రాజ‌కీయాల‌కు స‌మ‌న్వ‌యం చేస్తూ.. బాబు ఒక ప్లే సృష్టించారు.ఈ స‌మ‌యంలోనే జ‌గ‌న్ కూడా బీసీ వ‌ర్గానికి చెందిన మంత్రి జ‌య‌రాం స‌హా.. పార్టీ విప్‌, ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌ను రంగంలోకి దింపారు.

బీసీ వ‌ర్గాల‌కు అచ్చ‌న్న ఒక్క‌డే ప్ర‌తినిధా ? అంటూ జోగి క‌డిగిపారేశాడు. బీసీ వ‌ర్గాల నాయ‌కుడు అయితే, అక్ర‌మాల‌కు, అవినీతికి పాల్ప‌డ‌మ‌ని ఎవ‌రైనా చెప్పారా? అని నిల‌దీశారు. అంతేకాదు, ఈ కేసు ఊపందు కుని నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తే.. అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు లోకేష్ కూడా చువ్వ‌లు లెక్క‌పెట్టాల్సి వ‌స్తుందని హెచ్చ‌రించారు. ఇక‌, జ‌య‌రాం కూడా ఇదే త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు జ‌రుగుతున్న‌ది బీసీ వ‌ర్సెస్ జ‌గ‌న్ పోరాటం కాద‌ని, అవినీతి వ‌ర్సెస్ జగ‌న్ పోరాట‌మ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డంతో బాబుకు గాలిపోయినంత ప‌నైంది!!

Read more RELATED
Recommended to you

Exit mobile version