వైసీపీ అధినేత, సీఎం జగన్ మరో పందేరానికి రెడీ అయ్యారు. వైఎస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50వేల చొప్పున సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆగస్ట్ 12న ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అయితే, ఇప్పటికే అనేక పథకాలు ప్రారంభించి.. ప్రజాధనాన్ని పేదలకు పంచుతున్నారు. అయితే, ఇది సుదీర్ఘ ప్రాతిపదికన తీసుకుంటే.. ఆయనకు మేలు చేసేదేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలకు డబ్బులు పంచడం ద్వారానే అధికారం శాశ్వతం చేసుకుంటామని భావించిన ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఈ దేశంలో మళ్లీ మళ్లీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. తమిళనాడును తీసుకుంటే.. అక్కడ దివంగత సీఎంలు జయలలిత, కరుణానిధులు పందేలు వేసుకుని మరీ ప్రజాధనాన్ని ఉచితాల పేరిట పందేరం చేశారు. అయినప్పటికీ.. వారు వరుసగా అధికారంలోకి వచ్చింది లేదు. ఇక, ఏపీలోనూ గత ఏడాది ఎన్నికల సమయంలో చంద్రబాబు పందేరానికి పెద్దపీట వేశారు. ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు జగన్ కూడా వచ్చింది వచ్చినట్టు పందేరాలకు పంచేస్తున్నారు. ఇది కూడాఅంతే అవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయడం ద్వారా దివంగత వైఎస్ సాధించిన రికార్డు దిశగా జగన్ అడుగులు వేయాలనేది వీరి సూచన. అంటే.. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు స్వయం సాధికారత సాధించేలా నిర్ణయాలు తీసుకుని, వారితో స్వయం ఉపాధికి మరింత మార్గం ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తే.. వారికి అది భారీ ప్లస్ అవుతుంది.ఫలితంగా ప్రభుత్వ ఆలోచన కూడా వర్కవుట్ అవుతుంది. అలా కాకుండా కేవలం పందేరాలకు మాత్రమే పరిమితం అయితే.. అది సుదీర్ఘకాలం నిలిచే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు.