మొన్న హైదరాబాద్.. నిన్న బెంగళూరు.. ఇప్పుడు చెన్నై వరుణుడు మహానగరాలపై ప్రతాపం చూపుతున్నాడు. భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయ్. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయ్. చెన్నైకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
మొన్న హైదరాబాద్‌ని వణికించాయ్. బెంగళూరును అతలాకుతలం చేశాయ్. ఇప్పుడు చెన్నైలో బీభత్సం సృష్టిస్తున్నాయ్ భారీ వర్షాలు. చెన్నై మహానగరంలో ఎడతెరిపిలేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయ్. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో కుండపోత వర్షం కురిసింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వర్షానికి చెన్నై జలమయమైంది. రోడ్లు చెరువుల్లా మారాయి. పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. జన జీవనం అస్తవ్యస్తమైంది. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురువడం వల్ల.. బయటకు రావడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. దక్షిణ చెన్నైలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో నీళ్లు ఎక్కడిక్కడ నిలిచిపోయాయ్.