ఛత్తీస్గడ్ లో మరోసారి మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కొన్నాళ్ల పాటు చత్తీస్ గఢ్ లో మావోయిస్టుల కదలికలు పరిమితం అయిన తరుణంలో ఒక్కసారిగా దుశ్చర్యకు పాల్పడ్డారు. రైల్ ఇంజిన్ కు నిప్పు పెట్టి తగలబెట్టారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి వెళ్తున్న రైలును ఆపి ఇంజిన్ కు నిప్పు పెట్టడంతో.. పూర్తిగా ఇంజిన్ కాలిపోయింది. ఇంజన్ లోపలి భాగాలు పూర్తిగా దగ్థమయ్యాయి. కోట్లాది రూపాయల నష్టం రైల్వేకు వాటిల్లింది. ఈ ఘటన దంతెవాడ జిల్లా బచేలి-భాన్సీ మార్గంలో చోటు చేసుకుంది.
సమారు 20 మంది సాయుధులైన మావోయిస్టులు రైలును అడ్డగించి.. ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లా కిరండూల్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఓడరేవు నగరమైన విశాఖపట్నంకు ఇనుప ఖనిజంతో సరకు రైలు వెళ్తోంది. మావోయిస్టుల ఈ చర్య వల్ల ఆ మార్గంలో రైలు ప్రయాణాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కిరండూల్- విశాఖ మర్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.