రోజు రోజు చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. రిటైల్ చికెన్ షాపుల్లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.300 వరకు అమ్ముతుండగా.. ఇక స్కిన్ ఉన్న చికెన్ కూడా రూ.280 దాటిపోయింది. గతంలో ఏటా ఎండా కాలంలో తగ్గే చికెన్ ధరలు గత కొన్నేండ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. పెండ్లిళ్లు కూడా ఉండడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, కోళ్ల పెంపకం తగ్గడం వల్లే షార్టేజ్ ఏర్పడిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వేసవి కారణంగా ఫారాలు కోళ్ల పెంపకాన్ని భారీగా తగ్గించాయని, దాని ప్రభావం ధరలపై పడుతోందని పౌల్ట్రీ నిర్వాహకులు వెల్లడిస్తున్నారు.
ఆదివారం, సోమవారాల్లో స్కిన్ లెస్ చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కిలో రూ.300 వరకు అమ్మగా లైవ్ బర్డ్ కిలో రూ.180 వరకు విక్రయించారు. చికెన్ ధర గడిచిన వారం రోజుల్లో రూ.260 నుంచి క్రమంగా పెరుగుతూ ఆదివారం నాటికి రూ.280, రూ. 300కి చేరింది. వచ్చే ఆదివారం నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. ధర ఎక్కువగా ఉండడంతో వేస్టేజ్‌తో కూడా తమకు నష్టమే తప్ప పెద్దగా లాభం లేదంటున్నరు. వేసవి తీవ్రత పెరుగుతున్నందున చిక్స్ తక్కువగా వేయడంతో కోళ్ల షార్టేజ్ ఉంది. దీన్ని ఆసరగా చేసుకుని నష్టాలను పూడ్చుకోవడానికే పౌల్ట్రీ వర్గాలు ధరలు పెంచుతున్నట్లు సమాచారం.