శిక్షించి తీరుతాం.. అమెరికాకు చైనా వార్నింగ్‌..

-

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తీవ్ర ఉద్రిక్తతల మధ్య తైవాన్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన ముగిసింది. అయితే… తైవాన్‌ను తమ భూభాగంగా చెప్పుకుంటున్న చైనా.. పెలోసీ రాకకుముందే హెచ్చరికలు జారీ చేసింది. వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది చైనా. వాటిని బేఖాతరు చేస్తూ తైపేలో అడుగుపెట్టిన నాన్సీ.. తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అండగా ఉంటామన్న హామీ ఇచ్చారు నాన్సీ. తైవాన్ సార్వభౌమత్వాన్ని ఎవరూ లాక్కోలేరంటూ పరోక్షంగా చైనాకు హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె నిన్న సాయంత్రం తైపే నుంచి బయలుదేరి దక్షిణ కొరియా వెళ్లారు. తాము హెచ్చరించినా పట్టించుకోకుండా వచ్చి వెళ్లిన నాన్సీపై చైనా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.

నాన్సీ తైవాన్‌లో అడుగుపెట్టిన వెంటనే మిలటరీ డ్రిల్స్ ప్రారంభించిన చైనా తైవాన్ సమీపంలో ఆయుధాలను మోహరించింది కూడా. పెలోసీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. అమెరికాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ముసుగులో చైనా సార్వభౌమత్వాన్ని అమెరికా ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను రెచ్చగొట్టడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడమేనని, ఆ మంటల్లో కాలిపోక తప్పదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చైనాను అవమానించాలని చూసే వారిని శిక్షించి తీరుతామని వాంగ్ యీ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version