ఆచార్య ప్లాప్ విషయంలో చిరు మళ్ళీ సెటైర్… ఏమన్నారంటే..?

-

కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు థియేటర్​కు వెళ్లి తప్పకుండా సినిమా చూస్తారని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. చిత్రపరిశ్రమలో తాను రీఎంట్రీ ఇచ్చాక పరిశ్రమ విలువ మరింత బాగా అర్థమైందన్నారు సినిమా ఇండస్ట్రీలోనే తాను ఎదిగానని, కొన్నాళ్ల గ్యాప్‌ అనంతరం తిరిగి వచ్చాక ఆ పరిశ్రమ విలువ మరింత బాగా అర్థమైందన్నారు. ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయయ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ అనుబంధ సంస్థ అయిన శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన సినిమా ఇది. నూతన హీరో హీరోయిన్లతో వంశీధర్‌ గౌడ్‌, లక్ష్మీనారాయణ సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబరు 2న విడుదల కానుంది.

ఫస్ట్ డే ఫస్ట్ షో

నేను రావటానికి కారణం ఆయనే.. “నేను ఈ వేడుకకు రావటానికి ప్రధాన కారణం నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. ఆయన ఇక్కడే ఉండి, మనందరికీ ఆశీస్సులు అందిస్తుంటారని ప్రగాఢంగా నమ్ముతూ ఆయనకు నమస్కరిస్తున్నా. ఆయనతో నాకు సినిమాయేతర అనుబంధం ఉంది. వారి కుటుంబంలో నేను ఓ సభ్యుడిగా ఉండేవాణ్ని. తన నిర్మాణ సంస్థలో పనిచేసిన వారందరిపైనా నాగేశ్వరరావు ప్రేమ కురిపించేవారు. మనమంతా గర్వించదగ్గ పూర్ణోదయ బ్యానర్‌లో నేను రెండు సినిమాల్లో నటించా. నా కెరీర్‌ ప్రారంభంలో ఈ ప్రొడక్షన్‌ హౌజ్‌లో ‘తాయారమ్మ బంగారయ్య’ సినిమాలో చిన్న పాత్ర పోషించా. నాగేశ్వరరావు అభిరుచికి తగ్గట్టే దర్శకులు సినిమాలు తెరకెక్కించేవారు. అలా కె. విశ్వనాథ్‌- నాగేశ్వరరావు కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలొచ్చాయి. ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, నేను నటించిన ‘స్వయంకృషి’.. ఇలా ఎన్నో సినిమాలు అవార్డులు దక్కించుకున్నాయి. అల్లు రామలింగయ్య, ఏడిద నాగేశ్వరరావు కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఏడిద కుటుంబ సభ్యులు ఇప్పటికీ మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూస్తుంటారు. నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమా ఫంక్షన్‌కు రావటం నాకు చాలా సంతృప్తిగా ఉంది”

 

“చిత్ర పరిశ్రమలోనే నేను ఎదిగా. మీ అందరి ప్రేమానురాగాలు పొందా. మరో రంగానికి వెళ్లి కొంత గ్యాప్‌ అనంతరం తిరిగి వచ్చా. అప్పుడు సినీ పరిశ్రమ విలువ మరింత ఎక్కువగా తెలిసింది. సినిమా.. చాలా గొప్పది. ప్రతిభను ఆయుధంగా చేసుకునే ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకునే పరిశ్రమ ఇది. అలాంటి ఈ ఇండస్ట్రీలో నేను ఓ స్థానాన్ని సంపాదించుకోవటంతో నా జన్మ సార్థకత అయిందనుకుంటా. ‘సినీ పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలి.. మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి’ అనుకుంటూ కష్టపడిన ప్రతి ఒక్కరూ ఇక్కడ విజయం అందుకున్నారు. అలా కాకుండా ‘అనుకుంటే అయిపోతుంది’ అని తేలిగ్గా తీసుకుంటే ఇండస్ట్రీ కూడా అంత తేలిగ్గానే తీసుకుంటుంది. బయటకు వెళ్లేందుకు దారి చూపిస్తుంది. అకుంటిత సాధన, మొక్కవోని దీక్ష, పట్టుదల లేనిరోజున పరిశ్రమకు గుడ్‌బై చెప్పి వెళ్లిపోవడం నయం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహాన్ని చూస్తున్నా. వీరంతా అభివృద్ధిలోకి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా” అని చిరంజీవి అన్నారు. ఈ సినిమాకి కథ అందించిన ‘జాతి రత్నాలు’ ఫేం అనుదీప్‌ కేవీ, సంగీత దర్శకుడు రథన్‌ను కొనియాడారు. మహిళలు ఇండస్ట్రీలోకి రావాలి..

 

“పరిశ్రమలోకి మహిళలు వస్తున్నారంటే నేను ప్రోత్సహిస్తా. మా కుటుంబంలోని ఆడ పిల్లలు ఈ ఇండస్ట్రీలోకి వస్తానంటే ‘ఇది వండర్‌ఫుల్‌ ఇండస్ట్రీ.. తప్పకుండా రండి’ అని ఆహ్వానించా. తెలుగు చిత్ర పరిశ్రమ మహిళలకు ఎంతో గౌరవం ఇస్తుంది. దాని గురించి ఇతర పరిశ్రమవారు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే మహిళలు రావాలి.. తామెంటో నిరూపించుకోవాలి”

 

కంటెంట్‌ బాగుంటే.. “కొవిడ్‌ కాలం నుంచి ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదనే మాటలు వినిపిస్తున్నాయి. అది అపోహ మాత్రమే. ఆడియన్స్‌ సినిమాలను ఓటీటీలో చూస్తున్నా, యూట్యూబ్‌లో వీక్షిస్తున్నా.. సరే థియేటర్లకు వెళ్లి చూడాలనుకుంటున్నారు. సినిమా కంటెంట్‌ బాగుంటే వారు తప్పకుండా థియేటర్లకు వస్తారు. అలాంటి మంచి కథలు మనం చెప్పగలగాలి. ఇటీవల విడుదలైన సినిమాలు ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ అలా వచ్చినవే. మంచి స్టోరీలు చెప్పగలిగినప్పుడు ‘సినిమా ఫిలాసఫీ మారిపోయింది.. ఇంట్లోనే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు’ అని మనం అనుకోవాల్సిన పనిలేదు. కంటెంట్‌ బాగుంటే తప్పకుండా వస్తారు లేదంటే రెండో రోజే సినిమా పోతుంది. ఆ విషయంలో నేనూ బాధితుణ్నే (నవ్వుతూ..). పరిశ్రమను నడిపించాలంటే దర్శకులే పూనుకోవాలి. ‘ఎందుకు సినిమా హిట్‌ అయింది.. ఎందుకు ఫ్లాప్‌ అయింది’ అని చర్చించుకుంటుండాలి.

‘ఇందులో ఏం ఉందని ప్రేక్షకులు చూడాలి’ అని తమ కథలను తాము ప్రశ్నించుకోవాలి. సమాధానం అదే చెబుతుంది. నటుల డేట్స్‌ అందాయని చకచకగా సినిమాలు తీయొద్దు. జాగ్రత్తగా ఉంటే హిట్‌లు వస్తాయి” అని చిరంజీవి ప్రసంగించారు. అనంతరం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కాగా, ఆ విషయంలో నేనూ బాధితుణ్నే అన్న విషయాన్ని ఆచార్య ను దృష్టిలో పెట్టుకొని అని ఉంటారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version