వైసీపీలో వివాదాస్పద ఎంపీగా పేరు తెచ్చుకున్న నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణం రాజు వ్యవహారం మరింత ముదిరి పాకాన పడిందని అంటున్నారు వైసీపీ నాయకులు. ఆది నుంచి వివాదాస్పదమైన ఆయన వైఖరి ఏకంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే వరకు వచ్చిందని చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా నేల విడిచి సాము చేయడం కిందకే వస్తుందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన రఘురామకృష్ణం రాజు.. అనంతరం.. తన చర్యల ద్వారా పార్టీ అధినే తకు దూరమవుతూ వచ్చారు. పార్టీతో సంబంధం లేకుండా పార్టీ ఆదేశాలను కూడా తీసుకోకుండానే ఆయన తన కుటుంబంతో సహా వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి వారితో భేటీ అయ్యారు.
అనంతరం, ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధాన పరమైన నిర్ణయాలను కూడా పార్లమెంటులో ప్రస్తావించి ఇరుకున పెట్టేలా వ్యవ హరించారు. ఇక, ఇటీవల కాలంలో మరింతగా ప్రభుత్వంపై విపక్షాన్ని మించిపోయిన రీతిలో అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న పార్టీ అధిష్టానం.. జిల్లాలో ఆయన పాల్గొనే కార్యక్రమాలకు పార్టీ నాయకులను దూరం పెట్టింది. వివాదాన్ని మరింతగా పెంచకూడదనే ఏకైక కారణంతో ఇలా వ్యవహరించింది. అయితే, ఆదిలోనే తన పొరపాటును గ్రహించని రఘురామకృష్ణం రాజు.. మరింతగా పార్టీపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇక, ఇప్పుడు ఏకంగా తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ.. పార్లమెంటు స్పీకర్‌కు లేఖరాసుకున్నారు.
సహజంగా ఇది జరిగేదేనని సరిపెట్టుకోవడానికి వీల్లేని రీతిలో ఎంపీ వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ.. అది ప్రాంతీయ పార్టీ అయినా.. జాతీయ పార్టీ అయినా.. నాయకుల అభీష్టాలకు అనుకూలంగా పార్టీ నడవబోదని, పార్టీకి కొన్ని పాలసీలు, పద్ధతులు ఉంటాయని, వాటిని ఇష్టం ఉన్నా.. లేక పోయినా..పాటించాల్సిన అవసరం ఉం టుందని చెబుతున్నారు. గత ఏడాది ఎన్నికల్లో సొంత బాబాయే అయినప్పటికీ.. ఎంతగా పట్టుబట్టినప్పటికీ..వైవీ సుబ్బారెడ్డి కి జగన్ టికెట్ ఇవ్వలేదు. అలాగని ఆయన తిరుగుబావుటా ఎగరేశారా? లేక పార్టీ లోగుట్లు తెలుసు కాబట్టి.. బయటకు వచ్చి జగన్‌కు వ్యతిరేకంగా పార్టీలైన్‌కు వ్యతిరేకంగా ఏమైనా కామెంట్లుకుమ్మరించారా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
పార్టీలో ఉండాలని లేకపోతే.. గౌరవంగా చెప్పి తప్పుకోవచ్చు.. అంతే తప్ప.. పార్టీలోనే ఉంటాం.. పార్టీ ని మేమే నడిపిస్తాం.. అంటే అయ్యేదేనా? అది టీడీపీ అయినా.. బీజేపీ అయినా.. పరిస్థితి ఒకటే. గతంలో బీజేపీలోనూ అనేక మంది నాయకులను బహిష్కరించిన సందర్భం ఉంది. ఎక్కడైనా నేల విడిచి సాము చేస్తే.. ఏపార్టీ కూడా సహించే పరిస్థితి లేదనేది సదరు ఎంపీ తెలుసుకుంటే.. నాలుగు కాలాల పాటు పార్టీలో ఉండే అవకాశం ఉంటుంది. లేకుండా చరిత్రలో కలిసి పోవడం ఖాయం అంటున్నారు పరిశీలకులు.