హైదరాబాద్లోని ఎల్బీస్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. జీహెచ్ఎంసీ, పోలీసు, వైద్య, ఫైర్, వాటర్ వర్క్స్ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అన్ని మతాలను సమానంగా చూడటంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రైస్తవ పెద్దలతో సమావేశమవుతానని స్పష్టం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత పురోగమించినా.. క్రీస్తు బోధనలు అనుసరణీయమని వ్యాఖ్యానించారు. సంతోషకర సమాజం కోసం క్రీస్తుతో పాటు మరెందరో మహానుభావులు కృషి చేశారన్న ముఖ్యమంత్రి.. క్రీస్తు బోధనలు అందరూ పాటించి సంతోషకర జీవితాన్ని గడపాలని సూచించారు.