దళితబంధుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గానికి 1500 మంది చొప్పున దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఈ ప్రక్రియను ఈ ఏడాది నుంచే అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత దశలవారీగా దళితబంధు పథకం అమలు చేయాలన్నారు. అలాగే దళితబంధు పథకం అమలులో అధికారులు మరింత వేగం పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
జూన్ 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో అధికారులు, పార్టీ నాయకులు రాష్ట్ర ప్రగతిని తెలియజేస్తూ.. ప్రసంగాలు ఇవ్వాలన్నారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిర్భావ వేడుకలను ఉదయం 9 గంటలకు ప్రారంభించాలన్నారు. అలాగే జిల్లా కేంద్రాల్లో సాయంత్రం వేళ వేడుకలు నిర్వహించాలన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘కవి సమ్మేళన కార్యక్రమం’ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని కవులు, రచయితలు హాజరు కావాలన్నారు. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలన్నారు.